ఇ‘స్మార్ట్‌’ పాలసీ..!

29 Jul, 2019 02:54 IST|Sakshi

జీవిత బీమాకు టర్మ్‌ ప్లాన్లు బెటర్‌

ప్రీమియం వెనక్కి రాదన్న భావన వద్దే వద్దు 

ప్రీమియం చాలా తక్కువ

ఎన్నో అవసరాలకు రక్షణ 

రుణాలకూ రక్షణనిచ్చే టర్మ్‌ ప్లాన్‌లు 

ప్రీమియం భారం తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్‌

ఆర్జన కలిగిన ప్రతీ ఒక్కరూ ఒక్కసారి దృష్టి సారించాల్సిందే 

జీవిత బీమా... ఇప్పటికీ చాలా మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదన్న ఆకాంక్ష ఎక్కువ మందిలో ఉన్నప్పటికీ... ఆచరణకు వచ్చే సరికి సరైన కవరేజీ తీసుకుంటున్న వారు అతి స్వల్పం. పాలసీ కడితే నాకేంటి...? అన్న ప్రశ్న వారిది. కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక రక్షణ కల్పించే పాలసీని తక్కువ ప్రీమియానికే టర్మ్‌ ప్లాన్‌ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.... తాను జీవించి ఉంటే చివరకు నాకు వచ్చేది ఏదీ లేదన్న భావన ఎక్కువ మందిని టర్మ్‌ప్లాన్‌  వైపు అడుగులు వేయనీయడం లేదు. తాజాగా నిర్వహించిన సర్వేల్లోనూ సగటు వ్యక్తి ఇదే ఆలోచిస్తున్నట్టు వెల్లడైంది.

మన చుట్టూ ఉన్న వారిలో ఎంత మందికి జీవితబీమా రక్షణ ఉందో చెప్పగలరా..? ఆర్థిక రక్షణ కల్పించే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు చౌకగా లభిస్తున్నప్పటికీ ఎక్కువ మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదన్న నిజం తెలుసా..? మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇటీవల సొంతంగా సర్వే నిర్వహించాయి. దేశంలో వ్యక్తుల ఆర్ధిక సన్నద్ధత ఎలా ఉంది? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఈ రెండు సంస్థల సర్వేల్లోనూ తెలిసిన విషయాలు ఇవే. మ్యాక్స్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 33.3 శాతం మందికి బీమా రక్షణ ఉండగా, అందులోనూ కేవలం 20 శాతం మందికే టర్మ్‌ ప్లాన్‌  ఉన్నట్టు తెలిసింది. ఇక ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సర్వేలో 83 శాతం మంది తమ కుటుంబ రక్షణ కోసం అవసరమైన మొత్తం పట్ల అవగాహనతో ఉన్నప్పటికీ, వారు తీసుకున్న బీమా రక్షణ అతి స్వల్పంగానే ఉండడం నివ్వెరపరిచే విషయం. కేవలం తమ వార్షిక ఆదాయానికి 1.67 రెట్ల మేరే బీమా కవరేజీతో ఎక్కువ మంది ఉన్నారు.

వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు అయినా బీమా కవరేజీ ఉండాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. అంటే కావాల్సినంత బీమా కవరేజీ తీసుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలు తీసుకుని ఉంటే వారికి తగినంత రక్షణ లభించి ఉండేది. కానీ నేటికీ చాలా మంది టర్మ్‌ ప్లాన్లకు చెల్లించే ప్రీమియం వెనక్కి రాదన్న ఉద్దేశ్యంతో సంప్రదాయ పాలసీలను తీసుకుంటూ తమ కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ విషయంలో రాజీ పడుతున్నట్టు సర్వేల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇప్పటికైనా కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి టర్మ్‌ ప్లాన్‌  దిశగా అడుగులు వేయాలన్నది నిపుణుల సూచన.  

ప్రీమియం చాలా తక్కువ 
గడిచిన పదేళ్ల కాలంలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్ల ప్రీమియం చాలా తక్కువ స్థాయిలకు దిగొచ్చినప్పటికీ... చాలా మంది వ్యక్తులు వీటికి దూరంగా ఉన్నారు. ‘‘గత 18 ఏళ్లలో జీవిత బీమా సంస్థలు ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాయి. దాంతో అవి తమ అండర్‌రైటింగ్‌ ప్రక్రియలను మెరుగుపరిచాయి. బిగ్‌ డేటా, డేటా అనలటిక్స్‌ ద్వారా కస్టమర్లను సూక్ష్మంగా పరిశీలించే అవకాశం వాటికి లభించింది. దాంతో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తగిన నమూనాలు, ధరలతో కూడిన ఉత్పత్తులను రూపొందించాయి’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పునీత్‌ నందా తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తికి రూ.కోటి రూపాయల బీమా రక్షణకు పదేళ్ల క్రితం అయితే రూ.20,000–30,000 ప్రీమియం ఉండేదని, అదిప్పుడు రూ.8,000–10,000కు తగ్గిపోయినట్టు నందా చెప్పారు.  

అయితే, డిస్ట్రిబ్యూటర్లు టర్మ్‌ ప్లాన్ల విక్రయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం కూడా ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు టర్మ్‌ ప్లాన్లను విక్రయించేందుకు సుముఖంగా లేరు. టర్మ్‌ ప్లాన్లపై వారికి ముట్టే కమీషన్‌  తక్కువగా ఉంటుంది’’ అని పాలసీబజార్‌ డాట్‌కామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ సంతోష్‌ అగర్వాల్‌ తెలిపారు. చాలా మంది  తమ పెట్టుబడి అవసరాలు, పన్ను ఆదా కోసం బీమా పాలసీలు తీసుకుంటున్నారని, టర్మ్‌ ప్లాన్ల అమ్మకాలు తక్కువగా ఉండడానికి ఇది మరో కారణమని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌  చీఫ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ధీరజ్‌ సెహ్‌గల్‌ పేర్కొన్నారు. సంప్రదాయంగా మన దేశంలో పెట్టుబడి ఆధారిత బీమా పాలసీల కొనుగోలు ఎక్కువ.

గడువు తీరిన తర్వాత నిర్ణీత మొత్తం తిరిగి వస్తుందన్న ఆకర్షణ వాటిల్లో వారికి కనిపిస్తోంది. అదే టర్మ్‌ ప్లాన్ల గడువు తీరిన తర్వాత రూపాయి కూడా తిరిగి రాదు. దీంతో వీటిని ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఏమీ తిరిగి రాదు కనుకనే వీటిల్లో ప్రీమియం తక్కువగా ఉంటుందన్న సూక్ష్మాన్ని గ్రహించే వారు తక్కువగా ఉంటున్నారు. చిన్న వయసులో టర్మ్‌పాలసీ తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియానికే మంచి కవరేజీ పొందొచ్చు. ఇలాంటి కొన్ని వ్యూహాల ద్వారా ప్రీమియాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశాలు, అదే సమయంలో మంచి కవరేజీ పొందే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

వయసు ఆధారంగా కవరేజీ 
సాధారణంగా వివాహం కాని వారికి భవిష్యత్తులో బాధ్యతలు పెరుగుతాయి కనుక వారు నిర్ణీత కాలానికి బీమా మొత్తం పెరిగే పాలసీలను తీసుకోవచ్చు. అదే వివాహమై 30 ఏళ్లు దాటిన వారికి, వయసు పెరుగుతున్న కొద్దీ కవరేజీ అవసరం తగ్గుతూ వెళుతుంది. ఎందుకంటే కొంత కాలానికి పొదుపు, పెట్టుబడులతోపాటు, ఆస్తులు కొంత మేర సమకూర్చుకుని ఉంటారు. ఉదాహరణకు 35 ఏళ్లున్న చరణ్‌ 60 ఏళ్లకు రిటైర్‌ అవుతారని అనుకుంటే, 25 ఏళ్ల పాటు పనిచేయగలుగుతారు. ఈ కాలంలోనే అన్ని రకాల లక్ష్యాలకు పొదుపు, మదుపులు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహాలు సహా తన అన్ని అవసరాలకు రూ.2 కోట్లు అవసరం అనుకుంటే... ఒకవేళ ప్రాణ ప్రమాదం ఎదురైతే చరణ్‌పై ఆధారపడిన కుటుంబానికి ఎంత కష్టం ఎదురవుతుందో ఆలోచించండి.

అందుకే రూ.2 కోట్ల కవరేజీకి ఈ వ్యక్తి టర్మ్‌ ప్లాన్‌  రూపంలో వార్షికంగా రూ.17,396 చెల్లించడం ద్వారా పూర్తి రక్షణ పొందే అవకాశం సొంతం చేసుకున్నట్టు అవుతాడు. అయితే, 60 ఏళ్ల వరకూ రూ.2 కోట్ల కవరేజీ అవసరమా..? అంటే లేదనే సమాధానం వస్తుంది. రూ.2 కోట్లతో ఒకే పాలసీ తీసుకోకుండా, నాలుగు భాగాలు చేసి రూ.50 లక్షల చొప్పున భిన్న కాలాలకు తీసుకోవడం చక్కగా ఉంటుంది. 10 ఏళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్ల కాలానికి ఒక్కోటీ రూ.50 లక్షలకు తీసుకోవాలి. తద్వారా తన బీమా రక్షణ అవసరాల్లో రాజీ పడకుండా ప్రీమియం రూపంలో ఆదా చేసుకోవచ్చు. 25 ఏళ్ల టర్మ్‌లో రూ.2 కోట్ల కవరేజీకి రూ.4.48 లక్షలు ప్రీమియం రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రూ.50 లక్షల చొప్పున భిన్న కాలానికి ఒక్కోటీ తీసుకోవడం వల్ల చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం రూ.2.7 లక్షలకు తగ్గిపోతుంది. దీనివల్ల రూ.1.7 లక్షలు ఆదా చేసుకోవచ్చని నిపుణుల విశ్లేషణ.  

ఈ విధానంలో బీమా పాలసీలు నాలుగు తీసుకోవడం వల్ల... పదేళ్ల తర్వాత నుంచి ప్రతీ ఐదేళ్లకు ఒక పాలసీ చొప్పున మెచ్యూరిటీ అవుతుంది. తీసుకున్న తర్వాత మొదటి పదేళ్లు రూ.2కోట్ల బీమా కవరేజీ లభిస్తుంది. చరణ్‌కు 45 ఏళ్లు వచ్చిన తర్వాత (అంటే పదేళ్ల తర్వాత) బీమా కవరేజీ రూ.1.5 కోట్లకు తగ్గుతుంది. అలాగే 50 ఏళ్లు రాగానే రూ.కోటి కవరేజీ, 55 ఏళ్లకు వచ్చిన తర్వాత రూ.50 లక్షలకు కవరేజీ పరిమితం అవుతుంది. ఇలా చేయడం వల్ల ప్రీమియం 25–30 శాతం ఆదా అవుతుందని ఏగా¯Œ  లైఫ్‌ ఇన్సూరె¯Œ ్స ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ హరీష్‌ కురూది తెలిపారు.

బాధ్యతలకు విడిగా కవరేజీ... 
జీవిత బీమా అన్ని ఆర్థిక అవసరాలకూ రక్షణ కల్పించేది అయి ఉండాలి. లేదంటే ఒక్కో అవసరానికి ఉద్దేశించిన పాలసీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు గృహ రుణం తీసుకునేట్టు అయితే, రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్‌ ప్లాన్‌  విడిగా తీసుకోవాలి. ఈ పాలసీ టర్మ్‌ కూడా రుణ కాల అవధికి సరిపడా ఉండాలి. ఒకవేళ ఈ టర్మ్‌ ప్లాన్‌ కవరేజీ లేనట్టయితే... రుణం తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో వారసులు ఇంటి రుణం తీర్చలేకపోతే, ఆ ఇంటిని బ్యాంకు వేలం వేసి రుణ బకాయిలు రాబట్టుకునే చర్యలు చేపడుతుంది. ఒకవేళ రుణానికి టర్మ్‌ కవరేజీ ఉన్న సందర్భంలో రుణ గ్రహీత మరణించినట్టయితే, చెల్లింపుల బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. దీనివల్ల కుటుంబానికి పెద్ద ఉపశమనం లభిస్తుంది.

అయితే, ఇలాంటి సందర్భాల్లో నిర్ణీత కాలం వరకు ఒకటే కవరేజీ కాకుండా, ఏటా తగ్గుతున్న రుణానికి అనుగుణంగా కవరేజీ తగ్గే పాలసీని తీసుకోవడం సముచితం అవుతుంది. ఈ పాలసీల్లో సమ్‌ అష్యూర్డ్‌ ఏటా నిర్ణీత శాతం తగ్గుతూ వెళుతుంది. రెగ్యులర్‌ టర్మ్‌ ప్లాన్‌తో పోలిస్తే ఇలా సమ్‌ అష్యూర్డ్‌ తగ్గుతూ వెళ్లే వాటిల్లో ప్రీమియం తక్కువగా ఉండడం అనుకూలం. ఉదాహరణకు ప్రభుత్వరంగ బీమా సంస్థ ఒకటి 35 ఏళ్ల వ్యక్తి, 30 సంవత్సరాల టర్మ్‌కు రూ.24 లక్షల కవరేజీకి రూ.67,449 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని రుణం తీసుకున్న ఏడాదే చెల్లించాల్సి ఉంటుంది. ఇదే వ్యక్తికి ఏటా కవరేజీ మారకుండా రుణ కాల వ్యవధి వరకు ఒకే విధంగా ఉండే పాలసీలో బీమా సంస్థ రూ.1.01 లక్షలను ప్రీమియం కింద వసూలు చేస్తోంది. అయితే, కేవలం కొన్ని బీమా సంస్థలే వీటిని ఆఫర్‌ చేస్తున్నాయి. ఎక్కువ శాతం గ్రూప్‌ ప్లాన్‌ను బ్యాంకులు అంటగడుతున్నాయి. ఒకవేళ మీకు గృహ రుణం ఇచ్చే సంస్థ సమ్‌ అష్యూర్డ్‌ ఏటా తగ్గుతూ వెళ్లే టర్మ్‌ ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తే... అటువంటి సందర్భాల్లో ఇతర క్రెడిట్‌ లింక్డ్‌ ప్లాన్లు, లెవల్‌ టర్మ్‌ ప్లాన్లతో పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి.  

సింగిల్‌ ప్రీమియం ప్లాన్లపై తగ్గింపు 
ప్రతీ నెలా, లేదా మూడు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించడానికి బదులు... ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధపడితే బీమా సంస్థలు తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నాయి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీ తీసుకోదలిస్తే... చౌకగా లభించే పాలసీలోనూ వార్షిక ప్రీమియం రూ.4,012 అవుతుంది. అంటే 20 ఏళ్లలో మొత్తం రూ.80,240 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సింగిల్‌ ప్రీమియం పాలసీలో రూ.59,531 కట్టేస్తే సరిపోతుంది. కానీ, ఈ విధానంలో నిజానికి చెల్లించిన మొత్తం ఆర్థిక గణాంకాల ప్రకారం ఎక్కువే అవుతుంది. ఎందుకంటే ముందుగానే పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాం కనుక. దీనికి బదులు ఒకేసారి ప్రీమియం చెల్లించడానికి బదులు, ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. నిర్ణీత కాలంలో సంపద వృద్ధి జరుగుతుంది కనుకనే బీమా సంస్థలు తగ్గింపును ఆఫర్‌ చేస్తుంటాయి. 5–10 ఏళ్లు వంటి తక్కువ టర్మ్‌ కోసం సింగిల్‌ ప్రీమియంను ఎంచుకోవడం మంచిదే అవుతుంది. స్థిరమైన ఆదాయం లేని వారికీ సింగిల్‌ ప్రీమియం పాలసీలు అనుకూలంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు