నిధుల వేటలో ప్రైవేట్‌ బ్యాంకులు

23 Jul, 2020 12:23 IST|Sakshi

ప్రిఫరెన్షియల్‌ ఇష్యూకే అధిక ప్రాధాన్యత

బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టతపై దృష్టి సారింపు

ఆర్థిక అనిశ్చితితో తొలి తైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న చిన్నతరహా బ్యాంకులు ఇప్పుడు తమ బ్యాలెన్స్‌ షీట్‌ను పటిష్టం చేసుకునేందుకు సిద్దమయ్యాయి. బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టత చర్యలో భాగంగా ప్రిఫరెన్షియల్‌ పద్దతిలో షేర్ల అమ్మకా ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌లు ఈ ఏడాది ద్వితీయార్థంలో కొంత వాటాను విక్రయం ద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకునే అవకాశం ఉంది. 

నిధుల సమీకరణ ఎందుకంటే: బ్యాంకింగ్‌ వ్యవస్థను దెబ్బతీసిన కోవిడ్‌-19, మారిటోరియం విధింపు  వాస్తవ ప్రభావాలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం నాటికి తెలుస్తాయి. అందువల్ల ఏమైనా అనుకోని ఒత్తిళ్లను ఎదుర్కోనేందుకు సిద్ధంగా తగిన మూలధన నిధులను సమీకరించడం చాలా ముఖ్యమని బ్యాకింగ్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే 2008 సంక్షోభం సమయంలో విదేశీ బ్యాంకులు ఎదుర్కోన్న అనుభవాల నుంచి దేశీయ బ్యాంకింగ్‌ ఎంతో నేర్చుకుంది. సంక్షోభ సమయంలో మూలధన సేకరణను ఆలస్యం చేసిన బ్యాంకులు ఎక్కువగా నష్టపోయిన సంగతిని ఈ సందర్భంగా బ్యాంకింగ్‌ నిపుణులు గుర్తుచేస్తున్నారు. 

  • ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ క్యూఐపీ ఇష్యూ పద్దతిలో ఇప్పటికే రూ.2025 కోట్లను సమీకరించింది. ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా డిసెంబర్‌లో మరో రూ.1000 కోట్ల సమీకరించనుంది. కరోనా సంక్షోభంతో వ్యాపారకలాపాలకు ఎలాంటి ఆటంకాంలు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నిధుల సమీకరణ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. 
  • రుణాలు, ఈక్విటీల కేటాయింపు ద్వారా రూ.12,000 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు ఫెడరల్‌ బ్యాంక్‌ ఇప్పటికే షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని తొందర్లో నిధుల సమీకరణ ప్రక్రియను చేపడతామని ఫెడరల్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశితోష్‌ కజరియా తెలిపారు.
  • డీసీబీ బ్యాంక్‌ రూ.500 కోట్ల సమీకరణకు షేర్‌హోల్డర్ల అనుమతులు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న ఒత్తిడికి అధిగమించేందుకు, భవిష్యత్తు వృద్ధి దృష్ట్యా నిధుల సమీకరణ అవసరమని బ్యాంక్‌ సీఈఓ మురళి నటరాజన్‌ తెలిపారు. బ్యాంక్‌ క్యాపిటల్‌ అడెక్వసీ 17.55శాతంగా ఉన్నందున నిధుల సమీకరణ తమకు అత్యవసరం కాదని ఆయనన్నారు. 
  • అలాగే ఇతర చిన్న బ్యాంకులు కూడా ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా నిధుల సమీకరించేందుకు ఇప్పటికే షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకున్నాయి. దీంతో సరైన సమయంలో ఆయా బ్యాంకులు నిధుల సమీకరణకు మార్కెట్‌ తలుపుతట్టే అవకాశం ఉంది.  

ఇందుకే ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ: ప్రస్తు‍త పరిస్థితుల్లో అందరు ఇన్వెస్టర్లు వాటా కొనుగోళ్లకు ఆసక్తి చూపే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఆయా బ్యాంకులు నిధుల సమీకరణకు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూను ఎంచుకున్నాయి. ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ఇష్యూ పద్దతిలో అతితక్కువ కాలంలో, తక్కువ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించి నిధులను సమీకరించే వీలు ఉంటుంది అని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు