గత మేనిఫెస్టోలపై చర్చకొస్తారా?  | Sakshi
Sakshi News home page

గత మేనిఫెస్టోలపై చర్చకొస్తారా? 

Published Sun, Nov 5 2023 2:21 AM

Union Minister Anurag Singh Thakur challenges CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర సమాచార, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ సవాల్‌ విసిరారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఎన్‌.రామచంద్రరావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాష్  లతో కలసి ఠాకూర్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.

గతంలో ఇ చ్చిన ఎన్నికల హామీల్లో ఎన్ని నెరవేర్చారో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్‌ తప్పిదం జరిగిందన్నారు. దీనికోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తే రైతులకు నీరు రాకపోగా పియర్లు కుంగాయని, ఇందులో రూ. వేల కోట్లు లూటీ అయ్యాయని ఆరోపించారు. సీఎంకు డబ్బుపై అంత మోజెందుకని ప్రశ్నించారు.

ఈ ప్రాజెక్టు అవినీతి, అక్రమాల వెనుక ఉన్న సూత్రధారి, ఫామ్‌హౌస్‌లో ఉండే వ్యక్తి పేరు తాను చెప్పాల్సిన అవసరం లేదని... తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టంపై విచారణ జరిగి అందుకుగల కారకులకు జైలుశిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం డ్యామ్‌ సురక్షితం కాదని తేలిందని చెప్పారు. 

బీఆర్‌ఎస్‌ పాలన అవినీతిమయం... 
బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పూర్తిగా అవినీతికూపంలో మునిగిపోయిందని, సీఎం కేసీఆర్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో యువతను మోసం చేశారని అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. కొడుకు, కూతురు అవినీతికి కేసీఆర్‌ రక్షణగా నిలిచారని దుయ్యబట్టారు.

తెలంగాణలో అక్రమ సంపాదనతో కడుపు నిండక ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో భాగస్వాములయ్యారని, ఈ కేసు విచారణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నంబర్‌ కూడా త్వరలోనే వస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ స్కాం సూత్రధారి అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు అందాయని... డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా జైలుపాలయ్యారని... ఈ కేసుతో సంబంధమున్న ఎమ్మెల్యేలపైనా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

తెలంగాణ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పోరాడాయని, రాష్ట్రానికి 9 ఏళ్లలో రూ. 9 లక్షల కోట్లు కేంద్రం కేటాయించిందని ఠాకూర్‌ తెలిపారు. కేసీఆర్‌ సర్కార్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితబంధు, తదితర హామీలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.  

‘సట్టా’మార్గంలో కాంగ్రెస్‌  ‘సత్తా’చాటాలనుకుంటోంది... 
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విదేశీ శక్తులు, విదేశీ డబ్బుతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోందని అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ‘సట్టా’(జూదం) మార్గంలో సత్తా (అధికారానికి) చాటాలని కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. దీనిపై రాహుల్‌ గాందీ, సోనియా గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు ఓ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా రూ. 508 కోట్లు ముట్టినట్లు ఈడీ పేర్కొందని చెప్పారు. రాజస్తాన్‌లో ఏకంగా సీఎంవో అధికారి వద్ద రూ. 2 కోట్లు, కేజీ బంగారం దొరికిందన్నారు. కర్ణాటక నుంచి రూ. కోట్లను తెలంగాణకు తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.  

Advertisement
Advertisement