లాభాల స్వీకరణకు అవకాశం..!

4 Jul, 2016 01:11 IST|Sakshi
లాభాల స్వీకరణకు అవకాశం..!

* వర్షపాత విస్తరణపై ఇన్వెస్టర్ల దృష్టి
* ఈ వారం మార్కెట్ తీరుపై నిపుణుల విశ్లేషణ

న్యూఢిల్లీ: లాభాల నుంచి స్టాక్ మార్కెట్ ఈ వారం ఒకింత విరామం తీసుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రంజాన్ సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు రోజు కావడంతో ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. గత వారం స్టాక్ మార్కెట్ లాభపడడంతో ఈ వారం లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశముందని, తదుపరి సంకేతాల కోసం ఇన్వెస్టర్లు వర్షపాత విస్తరణను గమనిస్తారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు..ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు.  ఈ నెల 5(మంగళవారం) వెలువడే నికాయ్ సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది.
 
కంపెనీలకు లాభాలు..
నైరుతి రుతుపవనాల విస్తరణ, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు.. ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.  సంస్కరణల జోరు, వర్షాలు తగిన రీతిలో కురుస్తుండడం, కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలోనే ఉంటాయన్న అంచనాల కారణంగా బ్రెగ్జిట్ ఉదంతం తర్వాత ఇన్వెస్టర్లు భారత్‌పై దృష్టిసారించారని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రయోజనాలన్నీ రానున్న క్వార్టర్లలో కంపెనీల లాభాలు పెరిగేందుకు తోడ్పడతాయని చెప్పారు.  ఈ వారంలో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉందని, దీంతో మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగవచ్చని  శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి, కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఒక వారంలో ప్రారంభమవుతాయని.. ఇవన్నీ సమీప కాలంలో మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వివరించారు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ లావాదేవీలపై ఆధారపడి ఈ వారం మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్‌సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీలు ముఖ్యంగా ముడి చమురు ధరల కదలికలు కూడా కీలకమేనని పేర్కొన్నారు.
 
ఫలితాలను బట్టి షేర్ల కదలికలు
గత వారంలో మార్కెట్ పనితీరు బాగా ఉందని, ఈ వారంలో కొంత కరెక్షన్ జరగవచ్చని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. రానున్న 4-6 వారాల్లో పలు కంపెనీలు ప్రకటించనున్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు కీలకం కానున్నాయని వివరించారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను బట్టి కంపెనీల షేర్ల కదలికలు జరిగినట్లే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను బట్టి కంపెనీల షేర్ల కదలికలు ఉంటాయని పేర్కొన్నారు.

ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోమవారం(జూలై 4) అమెరికా మార్కెట్లకు సెలవు. కాగా అంతకు ముందటి మూడు  వారాల వరుస నష్టాలకు గత వారంలో తెరపడింది. గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 747 పాయింట్లు పెరిగి 27,145వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 240 పాయింట్లు లాభపడి 8,328 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 8 నెలల గరిష్టానికి, నిఫ్టీ 10 నెలల గరిష్టానికి చేరాయి.

పెరుగుతున్న విదేశీ నిధుల ప్రవాహం..
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత నెలలో భారత స్టాక్ మార్కెట్లో రూ.3,713 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల మొత్తం రూ.20,600 కోట్లకు పెరిగాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.41,661 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది మార్చి-మే కాలానికి  రూ.32,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలతోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టారని క్వాంటమ్ ఏఎంసీ అసోసియేట్ ఫండ్ మేనేజర్(ఈక్విటీ) నీలేశ్ షెట్టి చెప్పారు. మంచి వర్షాలతో కంపెనీల పనితీరు బాగా ఉంటుందన్న అంచనాలతోనే నిధుల ప్రవాహం పెరుగుతోందన్నారు. కాగా  గత నెలలో ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ నుంచి రూ.6,220 కోట్లు వెనక్కి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు