కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీసేలా ఫిల్మ్‌రోల్‌

19 Nov, 2023 07:31 IST|Sakshi

డిజిటల్‌ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక రీళ్లు వేసుకునే పాతకాలం కెమెరాలు కనుమరుగైపోయాయి. పాత పద్ధతిలో కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీయడం ఇష్టపడేవారి కోసం తాజాగా డిజిటల్‌ ఫిల్మ్‌రోల్‌ అందుబాటులోకి వచ్చింది. అమెరికన్‌ ఫొటోగ్రఫీ కంపెనీ ‘ఐయామ్‌ బ్యాక్‌’ ఈ డిజిటల్‌ ఫిల్మ్‌రోల్‌ను ఇటీవల రూపొందించింది.

ఇందులోని ఫిల్మ్‌ రోల్‌ హోల్డర్‌లో 20 మెగాపిక్సెల్‌ సోనీ 4/3 సెన్సర్, బ్యాటరీ, మెమరీ కార్డ్‌ స్లాట్‌ ఉంటాయి. ఈ డిజిటల్‌ ఫిల్మ్‌ రోల్‌ హోల్డర్‌ను ఎలాంటి 35 ఎంఎం కెమెరాలోనైనా ఉపయోగించుకోవచ్చు.

పాతకాలం నికాన్, కేనన్, పెంటాక్స్, ఒలింపస్‌ తదితర కంపెనీల 35 ఎంఎం కెమెరాల్లో ఈ డిజిటల్‌ ఫిల్మ్‌రోల్‌ను వేసి, వాటితో ఇంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ‘కిక్‌స్టార్టర్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రీఆర్డర్‌పై అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. 

మరిన్ని వార్తలు