బీపీసీఎల్‌ లాభం మూడు రెట్లు

9 Aug, 2018 01:05 IST|Sakshi

రూ.745 కోట్ల నుంచి  రూ.2,293 కోట్లకు అప్‌ 

భారీగా పెరిగిన రిఫైనింగ్‌ మార్జిన్‌  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీపీసీఎల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.745 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.2,293 కోట్లకు పెరిగిందని బీపీసీఎల్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ పరంగా నికర లాభం రూ.3.79 నుంచి రూ.11.66కు ఎగసిందని భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) పేర్కొంది. టర్నోవర్‌ 23 శాతం వృద్ధితో రూ.82,431 కోట్లకు పెరిగిందని వివరించింది.

అమ్మకాలు 10.04 మిలియన్‌ టన్నుల నుంచి 10.97 మిలియన్‌ టన్నులకు చేరాయని పేర్కొంది. ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల ఈ క్యూ1లో 7.49 డాలర్ల స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ను సాధించామని బీపీసీఎల్‌ తెలిపింది. గత క్యూ1లో ఇది 4.88 డాలర్లని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేర్‌ 1.1 శాతం క్షీణించి రూ.388 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు