మళ్లీ 11,000 కిందకు నిఫ్టీ

28 Sep, 2018 01:14 IST|Sakshi

ప్రభావం చూపని   సుంకాల పెంపు 

హెచ్చుతగ్గుల్లో రూపాయి

ఒడిదుడుకుల్లో సూచీలు 

218 పాయింట్లు పతనమై  36,324కు సెన్సెక్స్‌ 

76 పాయింట్లు క్షీణించి  10,978కు నిఫ్టీ 

డాలర్‌తో రూపాయి మారకం లాభ, నష్టాల మధ్య సయ్యాటలాడటం,  ముడి చమురు ధరలు భగ్గుమనడం ప్రతికూల ప్రభావం చూపాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్ల దిగువకు వచ్చేసింది. సెప్టెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గురువారంతో ముగిశాయి. చాలా మంది ట్రేడర్లు తమ పొజిషన్లను అక్టోబర్‌ సిరీస్‌కు రోల్‌ ఓవర్‌ చేయ కుండా ఆఫ్‌లోడ్‌ చేయడంతో స్టాక్‌ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. మరోవైపు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వాటాదారులతో సమావేశాన్ని ఆర్‌బీఐ రద్దు చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 218 పాయింట్లు నష్టపోయి 36,324 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 10,978 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, వాహన, ఇన్‌ఫ్రా, లోహ షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచింది. మరోవైపు లిక్విడిటీ సమస్యలను తీర్చడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా కొన్ని చర్యలకు ఉప క్రమించింది. అయితే ఇవేవీ స్టాక్‌ మార్కెట్‌ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి.  ఇక అమెరికా ఫెడ్‌  రిజర్వ్‌ రేట్ల పెంపు  మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు రేట్లను పెంచిన ఫెడ్‌... మరోసారి  పెంపు ఉంటుందని పేర్కొంది. 

474 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో మరింతగా లాభపడింది. 169 పాయింట్ల లాభంతో 36,712 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇంట్రాడేలో 304 పాయింట్ల నష్టంతో 36,238 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 474 పాయింట్ల రేంజ్‌లో కద లాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 36 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 100  పాయింట్లు పతన మైంది. ఆసియా మార్కెట్లు ఆరంభంలో లాభ పడినప్పటికీ, చివరకు మిశ్రమంగా ముగి శాయి. యూరప్‌ మార్కెట్లు స్వల్పంగా లాభ పడ్డాయి. యస్‌ బ్యాంక్‌ షేర్‌ 9 శాతం నష్టంతో రూ.203 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు