ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు

17 Feb, 2017 00:32 IST|Sakshi
ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు

ఏప్రిల్‌ నాటికి లక్షకు చేరనున్న క్యాప్‌జెమిని ఉద్యోగులు
కంపెనీ భారత్‌ సబ్సిడరీ చీఫ్‌ వెల్లడి


ముంబై: ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని భారత్‌లోని ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌ చివరినాటికి లక్షను చేరనున్నది. రక్షణాత్మక విధానాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ, కొత్త ఉద్యోగాలు అధికంగానే ఇస్తామని క్యాప్‌జెమిని తెలిపింది. ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు ఇస్తామని క్యాప్‌జెమిని ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శ్రీనివాస్‌ కందుల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్య 98,800గా ఉందని, ఈ ఏడాది ఏప్రిల్‌ చివరినాటికి ఈ సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొన్నారు. ముంబై ప్రధాన కేంద్రంగా  తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భారతీయులు ఉద్యోగులుగా ఉన్న విదేశీ ఐటీ కంపెనీల్లో ఇది మూడవది. యాక్సెంచర్, ఐబీఎమ్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

‘వీసా’ ఇబ్బందులు లేవు..
నియామకాల కోసం తాము సందర్శిస్తున్న క్యాంపస్‌ల సంఖ్య, ఇస్తున్న ఉద్యోగ ఆఫర్ల సంఖ్య పెరుగుతున్నాయని శ్రీనివాస్‌ చెప్పారు. రక్షణాత్మక విధానాలు తమపై ప్రభావం చూపబోవని, ఆటోమేషన్‌ జోరు పెరిగితేనే హైరింగ్‌ మందగిస్తుందని వివరించారు. తాము ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తే అక్కడి వారికే ఉద్యోగాలిస్తామని, అందుకని హెచ్‌ 1–బి వీసా  ఇబ్బందులు తమపై ఉండవని వివరించారు. వీసా ఆంక్షలు ఉన్నప్పటికీ, అత్యున్నత ప్రతిభ గల అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతామని చెప్పారు. ప్రతిపాదిత వీసా నిబంధనలపై స్పం దన అతిగా ఉందని విమర్శించారు.  డిజిటల్‌కు మారడం, ఆటోమేషన్, క్లౌడ్‌..ఐటీ రంగంలో ప్రస్తుతమున్న పెద్ద సమస్యలని పేర్కొన్నారు. 25 వేలమంది ఉద్యోగులతో కూడిన ఐ గేట్‌ విలీనం విజయవంతంగా పూర్తయిందన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు