విస్తరణలో సైఫర్‌క్లౌడ్...

12 Oct, 2014 01:17 IST|Sakshi
విస్తరణలో సైఫర్‌క్లౌడ్...

ఫైనాన్స్, ఫార్మా, టెల్కోలపై దృష్టి
కంపెనీ వ్యవస్థాపక సీఈవో ప్రవీణ్ కొఠారి వెల్లడి

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా ఎక్కువగా ఉత్తర అమెరికా, యూరప్ మొదలైన ప్రాంతాలకు పరిమితమైన కార్యకలాపాలను దేశీయంగా మరింతగా విస్తరించడంపై క్లౌడ్ సెక్యూరిటీ సేవల సంస్థ సైఫర్‌క్లౌడ్ దృష్టి సారించింది. ప్రధానంగా ఫైనాన్స్, ఫార్మా, టెలికం రంగాల కంపెనీలకు సేవలు అందించాలని యోచిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక సీఈవో ప్రవీణ్ కొఠారి వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే దాదాపు పాతిక సంస్థలతో ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు  హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్ ఉందని చెప్పారు.  కెనడా, జర్మనీ తదితర 30 దేశాల్లో, 100 పైగా సంస్థలకు సేవలు అందిస్తున్నామని కొఠారి వివరించారు. మొత్తం 500 మంది సిబ్బంది ఉండగా.. హైదరాబాద్ కేంద్రంలో 300 మంది పైచిలుకు ఉన్నట్లు తెలిపారు. ఈ సంఖ్యను త్వరలో మరో యాభై శాతం మేర పెంచుకోనున్నట్లు చెప్పారు.

రెండంచెల భద్రత..
క్లౌడ్ కంప్యూటింగ్ వినియోగం పెరుగుతున్న కొద్దీ..హ్యాకింగ్ సమస్య కారణంగా డేటా భద్రతకు కూడా ప్రాధాన్యం పెరుగుతోందని కొఠారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాము అత్యాధునికమైన సాంకేతికతను జోడించి క్లౌడ్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. సాధారణంగా క్లౌడ్ సేవలు పొందే కంపెనీలకు సంబంధించిన కంటెంట్ అనేది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఎన్‌క్రిప్ట్ అవుతుందని, దీని వల్ల చౌర్యానికి గురయ్యే ఆస్కారం ఉందన్నారు. తమ టెక్నాలజీ వల్ల కంపెనీ వద్ద క్షేత్ర స్థాయిలోనే కంటెంట్ ఎన్‌క్రిప్ట్ అవుతుందని, ఫలితంగా రెండంచెల భద్రత వ్యవస్థ వల్ల హ్యాకింగ్‌కి అవకాశం ఉండదని కొఠారి చెప్పారు. సేల్స్‌ఫోర్స్, అమెజాన్, గూగుల్ తదితర క్లౌడ్ కంప్యూటింగ్ సేవల సంస్థలకు అనుగుణంగా ఉండే 12 రకాల సొల్యూషన్స్ అందిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ 2020 నాటికల్లా 191 బిలియన్ డాలర్లకు చేరగలదని కొఠారి వివరించారు. అప్పటికల్లా క్లౌడ్ సెక్యూరిటీ సేవల మార్కెట్ దాదాపు 10 బిలియన్ డాలర్లకు చేరగలదన్నారు. హ్యాకింగ్ ఉదంతాలు పెరిగిపోతుండటంతో ఒక్క హ్యాకర్ దుశ్చర్యలను నియంత్రించేందుకు వెయ్యి మంది సెక్యూరిటీ నిపుణులు అవసరమవుతున్నారని కొఠారి చెప్పారు. దీంతో ఈ విభాగంలో నిపుణులకు డిమాండ్ నెలకొందని, వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తీర్చిదిద్దేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్‌క్రిప్షన్‌పై పరిశోధనలు చేసే పీహెచ్‌డీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని కొఠారి వివరించారు. అలాగే, క్లౌడ్ సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసే విషయంపై ట్రిపుల్ ఐటీ, ఓయూ, జేఎన్‌టీయూలతో చర్చలు జరుపుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు