రెండేళ్ల పాటు భారత వృద్ధి పరుగులే

20 Jul, 2018 01:29 IST|Sakshi

వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది

2018–19లో 7.3 శాతం, 2019–20లో 7.6 శాతం

ఆసియా డెవలప్‌మెంట్‌    బ్యాంకు అంచనా  

న్యూఢిల్లీ: భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇక ముందు కూడా ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని, చైనా కంటే వృద్ధిలో ముందే ఉంటుందని ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) అంచనా వేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2019–20లో 7.6 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదు చేస్తుందని పేర్కొంది. పెరుగుతున్న ప్రజల వినియోగం, అధిక సామర్థ్య వినియోగానికి తోడు ప్రైవేటు పెట్టుబడులు మెరుగుపడడం వంటివి వృద్ధి రేటుకు దన్నుగా నిలుస్తాయని తెలియజేసింది. భారత్‌ తన వృద్ధి రేటును నిలబెట్టుకుంటే, మరోవైపు చైనా వృద్ధి 2018లో 6.6 శాతం, 2019లో 6.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు 2017లో 6.9 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. 

‘‘భారత జీడీపీ వృద్ధి రేటు 2018–19లో 7.3 శాతంగా ఉంటుంది. బ్యాంకింగ్‌ రంగ బలోపేతానికి చేపట్టిన చర్యలతో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయి. జీఎస్టీ రూపంలో వచ్చే ప్రయోజనాలతో వృద్ధి రేటు 2019–20లో 7.6 శాతానికి పెరుగుతుంది. అయితే, చమురు ధరలు ఇంకా పెరిగితే వృద్ధి రేటుకు రిస్క్‌ ఉంటుంది’’ అని ఏడీబీ పేర్కొంది. మార్చి క్వార్టర్‌లో 7.7 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసిన భారత్‌... దక్షిణాసియా ప్రాంతంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు వివరించింది. ప్రస్తుత 2018–19 ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) వృద్ధి రేటు లోబేస్, ఎన్నికల ముందు ప్రజల వినియోగం, ఎగుమతుల్లో రికవరీ వంటి అంశాలతో బలపడుతుందని ఏడీబీ అంచనా వేసింది. ఇక, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలు ఉన్నప్పటికీ ఆసియా, పసిఫిక్‌ ప్రాంత దేశాల అభివృద్ది 2018, 2019లో బలంగానే ఉంటుందని పేర్కొంది. భారత్‌ కారణంగా దక్షిణాసియా అత్యధిక వేగంతో వృద్ది చెందుతున్న ప్రాంతంగా ఉంటుందని ఏడీబీ తన నివేదికలో వివరించింది.   

మరిన్ని వార్తలు