మార్చి నాటికి...100 డిజిటల్ గ్రామాలు

29 Jul, 2016 00:44 IST|Sakshi
మార్చి నాటికి...100 డిజిటల్ గ్రామాలు

అభివృద్ధికి సహకారం...
ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేసే దిశగా వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికల్లా  100 డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణలో మూడింటితో పాటు దేశవ్యాప్తంగా 21 గ్రామాలను ఈ విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ తరహా గ్రామాల్లో ఉచిత వై-ఫై నెట్‌వర్క్ సదుపాయం, టెక్నాలజీ, బ్యాంకింగ్ సేవల తీరుతెన్నులపై గ్రామస్తుకు శిక్షణనివ్వడం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆమె తెలిపారు. ఈ గ్రామాల్లో టెలిమెడిసిన్, విద్యా సంబంధ మెటీరియల్ సదుపాయాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నేత్ర పరీక్షల పరికరాలు, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు తదితర అవసరాల కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఎస్‌బీఐ రూ. 1.15 కోట్లు విరాళంగా అందించిన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో అరుంధతీ భట్టాచార్య పాల్గొన్నారు.

 సాధారణంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యకలాపాలకు సంస్థలు లాభాల్లో 2 శాతం కేటాయించాల్సి ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ రంగంలో ఒత్తిళ్ల నేపథ్యంలో తమ బ్యాంకు 1 శాతానికే పరిమితం అయ్యిందని అరుంధతీ భట్టాచార్య చెప్పారు. దీన్ని క్రమంగా రెండు శాతానికి పెంచుతామని పేర్కొన్నారు.  గత ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్ కింద రూ. 144 కోట్లు వెచ్చించినట్లు అరుంధతీ భట్టాచార్య తెలిపారు.

 అనుబంధ బ్యాంక్‌ల విలీనంపై అడిగిన ప్రశ్నకు స్పందించడానికి నిరాకరించారు. మరోవైపు కంప్యూటర్ అక్షరాస్యతపై అవగాహన పెంచే దిశగా ఐటీ సంస్థ ఒరాకిల్‌తో కలసి ‘టీ-చేంజ్’ కార్యక్రమం కింద స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. పైలట్ ప్రాతిపదికన ఆగస్టు 6న తొలుత హైదరాబాద్, బెంగళూరులో వీటిని ప్రారంభిస్తున్నట్లు.. అటుపైన వీటి సంఖ్యను దేశవ్యాప్తంగా వందకు పెంచుకోనున్నట్లు అరుంధతీ భట్టాచార్య వివరించారు. ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి ఎన్ రావు, ఎస్‌బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు