భూముల బదలాయింపు విరమించుకోవాలి | Sakshi
Sakshi News home page

భూముల బదలాయింపు విరమించుకోవాలి

Published Fri, Jul 29 2016 12:46 AM

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

– తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా 
ఉప్పునుంతల : మండలంలోని పెనిమిళ్ల శివారులో ఉన్న ప్రభుత్వ భూములను అటవీశాఖకు బదలాయించే ఆలోచనను అధికారులు విరమించుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాచేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల కోసం కొల్లాపూర్‌ ప్రాంతంలో సేకరించిన అటవీ భూములకు బదులుగా, ఇక్కడ పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను అటవీశాఖకు అప్పగిస్తున్నారని, తద్వారా పేదల పొట్టగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పేదలు ఆధారపడిన ప్రభుత్వ భూములను సేకరించడంలేదని అధికారులతో ప్రకటింపజేయాలని డిమాండ్‌చేశారు. అటవీశాఖకు భూమిని మార్పిడి చేయాలనే ఆలోచనను విరమించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెనిమిళ్ల మాజీ ఎంపీటీసీ రవికుమార్‌ సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌ సైదులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవులుగౌడ్, జిల్లా నాయకులు బాలకిషన్, డివిజన్‌ కార్యదర్శి గోపాల్, నాయకులు మల్లేష్, జైపాల్, రాజమౌళి, రైతులు ఉస్సేన్, బీక్యా, లక్ష్మయ్య, సోమ్లా, మంగ్యా, హన్మంత్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement