ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో మార్చి 1 నుంచి విస్తార సర్వీసులు

24 Jan, 2015 00:39 IST|Sakshi
ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో మార్చి 1 నుంచి విస్తార సర్వీసులు

న్యూఢిల్లీ: విస్తార ఎయిర్‌లైన్స్ తన విమాన సర్వీసులను విస్తరిస్తోంది.  మార్చి 1 నుంచి ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో రోజుకు రెండు విమాన సర్వీసులను నడపనున్నామని విస్తార సీఈఓ ఫీ టీక్ యో పేర్కొన్నారు. అలాగే వచ్చే నెల 20 నుంచి గోవాకు విమాన సర్వీసులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కంపెనీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి విమాన సర్వీసులను ఈ నెల నుంచే ప్రారంభించింది. ప్రస్తుతం వారానికి 68 సర్వీసులను నడుపుతున్నామని, వీటిని 164కు పెంచనున్నామని యో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ మూడు ఎయిర్‌బస్ 320 విమానాలను నడుపుతోంది. మార్చి కల్లా ఈ సంఖ్యను ఐదుకు పెంచనున్నది.
 
జెట్ ఎయిర్‌వేస్ రిపబ్లిక్ డే ఆఫర్లు


న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ తన గల్ఫ్ భాగస్వామి ఎతిహద్‌తో కలిసి రిపబ్లిక్ డే సందర్భంగా విమాన చార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. శనివారం నుంచి 3 రోజులపాటు  టికెట్ ధరల్లో 25% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ టికెట్లతో దేశీయ రూట్లలో మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంతర్జాతీయ రూట్లలో ఫిబ్రవరి 1 నుంచి ప్రయాణించవచ్చని పేర్కొంది.ఈ ఆఫర్లు ఇండియా నుంచి యూఎస్, యూరప్, మధ్య తూర్పు ప్రాంతాలకు ఉన్న ఎతిహద్ విమాన సర్వీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.
 
 

మరిన్ని వార్తలు