లంచం తీసుకుంటాం..నీకేంటీ నొప్పి... | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటాం..నీకేంటీ నొప్పి...

Published Sat, Jan 24 2015 10:29 AM

లంచం తీసుకుంటాం..నీకేంటీ నొప్పి... - Sakshi

జర్నలిస్టుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందులు
 
 సిటీబ్యూరో: ‘‘వాహనదారుల నుంచి లంచం డబ్బులు తీసుకుంటాం..నీకేంటి నొప్పి’’ అంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై జర్నలిస్టుపై చిందులు తొక్కాడు. అంతటితో ఆగకుండా ఆ జర్నలిస్టును దుర్భాషలాడాడు.
 
కానిస్టేబుల్ వీరంగం అతని మాటాల్లోనే...
 ‘‘లంచం డబ్బులు తీసుకుంటాం... అడగడానికి నీ వెవ్వరు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోడ్లపై డ్యూటీలు చేస్తాం. యాబ్భైయ్యో.. వందో  సంపాదించుకుంటాం తప్పేంటి. కమిషనర్‌కు ఫిర్యాదు చేసుకున్నా భయంలేదు. కావాలంటే నేను నిన్నే కమిషనర్ మహేందర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్తా పదా. నీవే యాబై వేలు అడిగావంటూ ఫిర్యాదు చేస్తా.  నీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయిస్తా’’..

 సైదాబాద్‌కు చెందిన జర్నలిస్టు జావెద్ తన బైక్‌పై గురువారం మధ్యాహ్నం 2.30కి రాజ్‌భవన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాడు. అక్కడి రహదారిపై వచ్చిపోయే వాహనాలను పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ జయరాం ఆపి డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని జావెద్ గమనించాడు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో అటు వైపుగా వచ్చిన ఆడి కారును కానిస్టేబుల్ ఆపాడు. డ్రైవర్‌తో కారు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించలేదని అడిగాడు. ఇంతలో డ్రైవర్ పక్కన కూర్చున్న పెద్ద మనిషి జేబులోంచి రూ. 100 నోట్‌ను తీసి కానిస్టేబుల్‌కు ఇవ్వడంతో కారును వదిలిపెట్టాడు. ఇదంతా సెల్‌ఫోన్‌లో  చిత్రీకరించి హాక్-ఐ ద్వారా నగర కమిషనర్‌కు జావెద్ ఫిర్యాదు చేశాడు. ఇంతలో విషయం తెలుసుకున్న కానిస్టేబుల్..జావెద్‌ను పట్టుకుని లంచం తీసుకుంటే నీ కేందిరా అంటూ నానా బూతులు తిట్టాడు.

అంతటితో ఆగకుండా పంజగుట్ట ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సిబ్బందిని కూడా అక్కడికి రప్పించి నానా రభస సృష్టించి జావెద్‌ను ఠాణాకు తీసుకెళ్లారు. ఇంతలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ షేక్ మాసూమ్ బాషాలు అసలు విషయం తెలుసుకుని జావెద్‌ను నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. హాక్-ఐకు పంపిన వీడియోను సైతం ఏసీపీలు తీసుకున్నారు. లంచం తీసుకోవడం, జర్నలిస్టును పట్టుకుని హింసించడంపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.ఎస్‌ఐ స్థాయి అధికారి లేకుండా సదరు కానిస్టేబుల్ వాహనాలను ఆపడం నేరమే. కాగా  ట్రాఫిక్ విభాగంలో దేశంలోనే తొలిసారిగా ట్రాఫిక్ క్యాష్ లెస్ చలానా విధానాన్ని  హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి  ప్రారంభించిన మూడు రోజులకే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.
 
 

Advertisement
Advertisement