మార్కెట్లకు ఎన్నికల ఫలితాల దిశానిర్దేశం

10 Dec, 2018 03:20 IST|Sakshi

క్రూడాయిల్‌ రేట్లు, అంతర్జాతీయ పరిణామాలూ కీలకమే

వెల్లడి కానున్న ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు

మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశాలు

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రూడాయిల్‌ రేట్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. రాజకీయ పరిణామాలతో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజీలు నిఘా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

‘మంగళవారం వెల్లడయ్యే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశీ.. అంతర్జాతీయ స్థూల  ఆ ర్థిక గణాంకాల వెల్లడి, క్రూడాయిల్‌ రేట్ల కదలికలు తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోణంలో చూస్తే అయిదు రాష్ట్రాల ఫలితాలు చాలా కీలకంగా ఉండనున్నాయి’ అని ఈక్విటీ99 సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్టు రాహుల్‌ శర్మ తెలిపారు. ‘ఒపెక్‌ సదస్సు, హువావే గ్లోబల్‌ సీఎఫ్‌వో అరెస్టు వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనలో పడవేశాయి. వీటితో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులకు ఆజ్యం పోయనున్నాయి’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ముస్తఫా నదీమ్‌ చెప్పారు.

‘అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ, క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరుగుతుండటం వంటి అంశాలతో ఈ వారం దేశీ సూచీలు ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కూడా హెచ్చుతగ్గులకు దారితీయొచ్చు. సూచీలు ఇంట్రా డేలో 1% పైగా అటూ ఇటూ సాధారణంగానే తిరిగేసే అవకాశం ఉంది’ అని ఎడెల్‌వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటెజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ తెలిపారు. టెక్నికల్‌గా చూస్తే భారీ కరెక్షన్‌కు లోనైన నిఫ్టీ మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవడంతో బుల్స్‌ తిరిగొచ్చేందుకు ఆస్కారముందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసాని చెప్పారు. నిఫ్టీ గానీ 10,775 పాయింట్ల నిరోధాన్ని దాటితే మరింత పెరగొచ్చని, 10,588 పాయింట్ల వద్ద మద్దతు ఉండగలదని పేర్కొన్నారు.  సెన్సెక్స్‌ గతవారం 521 పాయింట్లు క్షీణించి 35,673 వద్ద, నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 10,694 వద్ద క్లోజయ్యాయి.  

రూపాయిపైనా ఒత్తిడి ..
గతవారం ఆఖర్లో సమావేశమైన చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌ .. ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రెట్‌ క్రూడ్‌ రేటు శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పైగా పెరిగింది. మరోవైపు, చైనా టెలికం దిగ్గజం హువావే గ్లోబల్‌ సీఎఫ్‌వో మింగ్‌ వాంఝూను కెనడాలో అరెస్టు చేయడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీ మార్కెట్‌నూ కుదిపేసింది. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరో విడత వడ్డీ రేట్ల పెంచడంపై ఈ నెలలో నిర్ణయం తీసుకోనుండటం కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించేందుకు కారణం కానుంది. వడ్డీ రేట్లు పెంపుతో భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి.  ఈ పరిణామాలతో అంతర్జాతీయ ఫండ్స్‌ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చని, ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తవచ్చని అనలిస్టులు పేర్కొన్నారు.

70.50–72.50 మధ్య రూపాయి ..
ఈ వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.50–72.50 మధ్య తిరుగాడే అవకాశాలు ఉన్నాయని కొటక్‌ సెక్యూరిటీస్‌ డిప్యుటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (కరెన్సీ, వడ్డీ రేట్ల విభాగం) అనింద్య బెనర్జీ తెలిపారు. ‘అమెరికా డాలర్‌ను ట్రేడర్లు భారీగా షార్ట్‌ చేశారు. కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రాకపోవొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సెషన్లో షార్ట్‌ కవరింగ్‌ జరిగి రూపాయితో పోలిస్తే డాలర్‌ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి’ అని ఆమె తెలిపారు. ‘వచ్చేవారం ఎన్నికల ఫలితాలే కీలకంగా ఉంటాయి. ఒకవేళ మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే వచ్చి.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఏ ఒక్కదాన్లోనైనా గెలుపొందిన పక్షంలో రూపాయి ర్యాలీ చేయొచ్చు. అలా కాకుండా బీజేపీ ఓడిపోతే.. రూపాయికి ప్రతికూలంగా కాగలదు‘ అని అనింద్య వివరించారు. ఇవి కాకుండా ఈ వారం వెల్లడయ్యే స్థూల ఆర్థిక గణాంకాలూ కీలకం కానున్నాయి. 12న పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలు, డిసెంబర్‌ 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, ఎగుమతుల గణంకాలు విడుదల కానున్నాయి.

5 రోజుల్లో రూ. 400 కోట్లు
దేశీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు
న్యూఢిల్లీ: చైనా టెలికం పరికరాల సంస్థ హువావే సీఎఫ్‌వో అరెస్టుతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత 5 సెషన్స్‌లో ఏకంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం డిసెంబర్‌ 3–7 మధ్య వ్యవధిలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 383 కోట్లు ఉపసంహరించారు. అదే సమయంలో డెట్‌ మార్కెట్లలో రూ. 2,744 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. డిసెంబర్‌ 6న ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయని, ఎఫ్‌పీఐలు ఒక్క రోజులోనే రూ. 361 కోట్ల విక్రయాలు జరిపారని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ మేనేజర్‌ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాంఝూ అరెస్ట్‌ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణించడం ఇందుకు కారణమైందన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా