నోట్ల రద్దు సరిగ్గా అమలు కాలేదు

10 Dec, 2018 03:25 IST|Sakshi

చిన్న వ్యాపారాలు ఇంకా సమస్యల్లోనే...

ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యలు

ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ కూడా దీనిపై గళమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేయలేదని.. దీన్ని మెరుగైన ప్రణాళికతో చేసిఉంటే ఫలితాలు విభిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘డీమో’పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద్‌ కూడా తన పుస్తకంలో డీమోను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, నోట్ల రద్దువల్ల చిన్న వ్యాపారాలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అయితే, వీటి పునరుత్తేజానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు.

‘డీమో విషయంలో చిన్న విషయాలను పట్టించుకొని, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉండాల్సింది. దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు.. దీనికంటే అధిక విలువగల రూ.2,000 నోట్లను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా అమలు చేయడంలో వ్యూహం కూడా సరిగ్గా లేదు. భారీ స్థాయిలో నోట్లను రద్దు చేయాలని అనుకున్నప్పుడు, అందుకు తగ్గట్లుగా సరైన విలువ(డినామినేషన్‌) గల నోట్లను అంతే స్థాయిలో ఎందుకు అందుబాటులో ఉంచలేదు. ఇలాంటి అంశాలన్నింటినీ పట్టించుకుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. అయితే, డీమోతో ఫైనాన్షియల్‌ రంగానికి మాత్రం చాలా మేలు జరిగింది, నమ్మశక్యం కానంతగా పొదుపు పెరిగింది’  అని కోటక్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు