పావు గంటలో సమాచారమివ్వాల్సిందే

19 Aug, 2014 23:18 IST|Sakshi
పావు గంటలో సమాచారమివ్వాల్సిందే

ముంబై: బోర్డు సమావేశాలు ముగిసిన 15 నిమిషాల్లోగా లిస్టెడ్ కంపెనీలు ఆ వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా నిధుల సమీకరణ ప్రణాళికలు, డివిడెండ్లు, బోనస్‌లు, షేర్ల బైబ్యాక్ వంటి నిర్ణయాలను సమావేశం ముగిసిన పావుగంటలోగా కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ చర్చాపత్రాలను విడుదల చేసింది.

తద్వారా లిస్టెడ్ కంపెనీలు షేరు ధరపై ప్రభావాన్ని చూపగల కీలకమైన సమాచారాన్ని నిర్ణీత సమయంలోగా వెల్లడించేలా చేయాలన్నది సెబీ ప్రణాళిక. వెరసి ఇలాంటి అంశాల వెల్లడిలో ఆలస్యానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. వీటితోపాటు ఆర్థిక ఫలితాలు, స్వచ్చంద డీలిస్టింగ్, బోనస్ షేర్ల జారీ ద్వారా క్యాపిటల్ పెంచుకోవడం, రద్దు చేసిన షేర్లను తిరిగి జారీ చేయడంవంటి అంశాలను కూడా వెల్లడించేలా నిబంధనలను తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లు 26 పేజీల చర్చా పత్రాల్లో సెబీ పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు