కేంద్రంతో ఆర్‌బీఐకి భిన్నాభిప్రాయాలు సహజమే..

12 Nov, 2018 01:51 IST|Sakshi

చర్చించుకుంటే సరిపోతుంది

సెక్షన్‌ 7పై వివాదం దురదృష్టకరం

రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ డిప్యూటీ గవర్నర్‌ గాంధీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌కి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, ఇది ఆరోగ్యకరమైన ధోరణేనని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, రెండు పక్షాలు తరచూ చర్చించుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఆర్‌బీఐ తమ డిమాండ్లకు తలొగ్గేలా చేసేందుకు కేంద్రం సెక్షన్‌ 7ని ప్రయోగించడమనేది తీవ్ర చర్చనీయాంశంగా మారడం దురదృష్టకరమని గాంధీ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథంతో ఆలోచిస్తే.. రిజర్వ్‌ బ్యాంక్‌ మాత్రం ఎకానమీ శ్రేయస్సు కోసం దీర్ఘకాలిక దృష్టికోణం నుంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాల కారణంగా ఒక్కోసారి అంగీకారం కుదరకపోవచ్చు.   ఇవి కొత్తేమీ కాదు. అయితే, ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్యమధ్యలో చర్చించుకున్న పక్షంలో ప్రస్తుతం నెలకొన్న వివాదంలాంటివి తలెత్తవు’ అని గాంధీ పేర్కొన్నారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిపై కేంద్రం దాడి చేస్తోందన్న వివాదం నెలకొన్న నేపథ్యంలో గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

డిమాండ్లన్నీ అంగీకరించాలనేమీ లేదు..
బ్యాంకింగ్‌ వ్యవస్థకు సంబంధించి నిబంధనలు సడలించాలంటూ ఆర్‌బీఐని కేంద్రం కోరుతున్న అంశంపై స్పందిస్తూ.. ప్రభుత్వ డిమాండ్లన్నింటినీ రిజర్వ్‌ బ్యాంక్‌ అంగీకరించాలని లేదన్నారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు సేకరించి, ఎకానమీకి మేలు చేసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుం దని చెప్పారు. నవంబర్‌ 19న జరిగే రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు సమావేశంలోనే వివాదాస్పద అంశాలన్నీ పరి ష్కారం కావాలనేమీ లేదని, కొన్నింటిని ఆ తర్వాత రోజుల్లోనైనా చర్చించుకునే అవకాశం ఉందని గాంధీ చెప్పారు.

మరోవైపు, వార్షిక ఆడిట్‌ తర్వాత ఆర్‌బీఐ తన దగ్గరున్న మిగులు నిధుల నుంచి ప్రభుత్వానికి తగు వాటాలను బదలాయిస్తుందని ఆయన తెలిపారు. దీనిపై నిర్దిష్ట ఫార్ములా ఉండాలంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ గతంలోనే సూచించారని తెలిపారు. కానీ అప్పట్లో దీనికి అంగీకరించని ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఫార్ములానే కావాలని కోరుతోందని  పేర్కొన్నారు. దీనిపై చర్చ జరిగి, తగు విధివిధానాలు రూపొందించుకుంటే ఆర్‌బీఐ వాటికి కట్టుబడి ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు