డబ్బులిచ్చి మరి పాత నోట్లను కొంటున్నారట..!

28 Nov, 2018 19:35 IST|Sakshi

‘డిమానిటైజేషన్‌’.. ‘పెద్ద నోట్ల రద్దు’ జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డిమానిటైజేషన్‌ ప్రభావం నేటికి కూడా ఉంది. అయితే పనికి రాకుండా పోయిన ఈ పాత నోట్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి మరి కొంటున్నారట జనాలు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ‘ఇ-బే’లో ఈ పాత నోట్లను 6 డాలర్ల(రూ. 423)కి అమ్ముతున్నారు. అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పుకొంటున్న ఓ వ్యక్తి ఇ-బేలో ఈ పాత రూ. 500 నోట్లను అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికే 15 పాత నోట్ల అమ్ముడు పోయాయి.. మరో 9 మాత్రమే ఉన్నాయి త్వరపడండి అంటున్నాడు సదరు వ్యక్తి.

అయితే పనికి రావని తెలిసి కూడా ఈ పాత నోట్లను జనాలు ఎందుకు కొంటున్నారు.. అది కూడా దానికి సమానమైన విలువ చెల్లించి.. అంటే  పాత కరెన్సీని, కాయిన్స్‌ని సేకరించే అలవాటు ఉన్న వారే ఇలా కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అయితే పాత నోట్లను ఇలా అమ్మకానికి పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చాలా మంది తమ దగ్గర ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను ఇండియామార్ట్‌, ఓఎల్‌ఎక్స్‌ వంటి ఆన్‌లైన్‌ సైట్లలో అమ్మకానికి పెట్టారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా కరెన్సీ ట్రేడింగ్‌ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు.

మరిన్ని వార్తలు