సాహసోపేత సంస్కరణలకు చాన్స్

17 May, 2014 01:36 IST|Sakshi
సాహసోపేత సంస్కరణలకు చాన్స్

 న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఎన్డీయేకి స్పష్టమైన ఆధిక్యం రావడాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా విధానపరంగా సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన సంస్కరణలు చేపట్టగలరని ధీమా వ్యక్తం చేశారు.  ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, అధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు, తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకునేలా ఈ స్పష్టమైన మెజార్టీ తోడ్పాటు అందించగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా పేర్కొన్నారు. మరోవైపు, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు మెజార్టీ ఉపయోగపడగలదని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ తెలిపారు. రాబోయే 18-24 నెలల్లో ఎకానమీ నిలకడైన 10% వృద్ధి సాధించడానికి ఆస్కారం ఏర్పడినట్లయిందని ఆయన చెప్పారు. అటు వెల్‌స్పన్ రెన్యూవబుల్స్ ఎనర్జీ వైస్ చైర్మన్ వినీత్ మిట్టల్ .. ఇది ప్రజా విజయం అని వ్యాఖ్యానించారు.


 రియల్టీకి ఊతం..: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం వల్ల ప్రాపర్టీ మార్కెట్లు మళ్లీ కళకళ్లాడగలవని రియల్టీ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. నివాస గృహాలు, ఆఫీస్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరగగలదని అభిప్రాయపడ్డాయి. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గానీ పెరిగిన పక్షంలో ముందుగా లాభపడేది రియల్ ఎస్టేట్ రంగమేనని సీబీ్రఆ దక్షిణాసియా సీఎండీ అన్షుమన్ మ్యాగజైన్ చెప్పారు. గుజరాత్‌లో సుపరిపాలన అందించిన మోడీపై తమకు భారీ అంచనాలు ఉన్నాయని, రియల్టీ మార్కెట్లో సెంటిమెంటు గణనీయంగా మెరుగుపడగలదని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ చైర్మన్ లలిత్ జైన్ చెప్పారు.

 విధాన చర్యలు కావాలి: ఇన్‌ఫ్రా సంస్థలు
 మౌలికం తదితర ప్రధాన రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఎన్డీయే ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ఇన్‌ఫ్రా పరిశ్రమ కోరింది. చైనా స్థాయిలో ఎదగాలంటే కొత్త ఆర్థిక మంత్రిగా ఎవరు వచ్చినా సరే.. దేశం వేగవంతమైన వృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇండియా డిప్యుటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దినేష్ కనబార్ తెలిపారు. రహదారులు, విద్యుత్ మొదలైన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 
 పన్ను చట్టాలపై అస్పష్టతను తొలగించడం, జీఎస్‌టీని అమల్లోకి తేవడం, ద్రవ్యోల్బణ కట్టడికి చర్యలు తీసుకోవడం మొదలైనవి కొత్త ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యతలు కావాలి.     - చందా కొచ్చర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్

 నూతన ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలి. ద్రవ్యోల్బణం .. ద్రవ్య లోటు కట్టడి, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మెరుగుపర్చే చర్యలు తీసుకోవడం ముఖ్యం.  - కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్

 మరింత మంది ప్రముఖుల  అభిప్రాయాలు ఇవీ..
 కొత్త ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్య రంగంపై వ్యయాలను గణనీయంగా పెంచాలి. అందరికీ వైద్యం అందించే దిశగా తగిన ప్రణాళికను రూపొందించాలి. అలాగే, ప్రత్యక్ష పన్నుల కోడ్, జీఎస్‌టీని అర్జెంటుగా అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది.     - ప్రతాప్ రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్
 
 స్పష్టమైన ఆధిక్యం లభించడంతో దేశ ప్రజలకు, పరిశ్రమకు మేలు చేసే ఆర్థిక విధానాలను కొత్త ప్రభుత్వం అమలు చేయడానికి ఆస్కారం లభించింది. అధిక వృద్ధి సాధించేందుకు ఇది అనువైన వాతావరణాన్ని కల్పించగలదు.       - జీవీకే రెడ్డి, సీఎండీ, జీవీకే పవర్
 
 గుజరాత్‌లో మంచి పాలన అందించిన అనుభవం మోడీకి ఉంది. ఆయన నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు. ఈ ఎన్నికల ఫలితాలు.. రాజకీయ స్థిరత్వానికి, అధిక వృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి దోహదపడగలవు.  - శ్రీచంద్ హిందుజా, చైర్మన్, హిందుజా గ్రూప్
 

 సోషల్ మీడియా పాత్ర కీలకం
 ధనం, అసంబద్ధమైన హామీలు వంటి వాటికి లొంగకుండా అభివృద్ధి కోసం ఓటు వేసిన వారందరికీ అభినందనలు. ఈ ఎన్నికల్లో యువత సోషల్ మీడియా ద్వారా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన మోడీ, చంద్రబాబు, చంద్ర శేఖర్‌లకు అభినందనలు తెలపడమే కాకుండా అభివృద్ధి పరంగా ఆయా ప్రాంతాలను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది. - డాక్టర్. బీవీఆర్ మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సైయంట్

మరిన్ని వార్తలు