స్తంభించిన బ్యాంకింగ్

13 Nov, 2014 01:23 IST|Sakshi
స్తంభించిన బ్యాంకింగ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  వేతన సవరణలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు  బుధవారం జరిగిన ఒక రోజు సమ్మె కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం అయినట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 80,000 మందికిపైగా ఉద్యోగులు, అధికారులు ఈ ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారని, దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల లావాదేవీలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు.

వేతనాలను 25% పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తుండగా 11%కి మించి పెంచేది లేదని యాజమాన్యాలు అంటున్నాయి. దీంతో ఉద్యోగస్తులు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఉద్యోగులు 25 నుంచి  2% దిగొచ్చినా, యాజమాన్యం 1% కూడా పెంచడానికి ముందుకు రాకపోవడం... సిబ్బందిలో ఆగ్రహాన్ని పెంచిందని, అందుకే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నట్లు రాంబాబు తెలిపారు.

 ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచడానికి జోన్ వారీగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చామని, అందులో భాగంగా డిసెంబర్2న దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగస్తులు ఒక రోజు సమ్మెలో పొల్గొన్నట్లు ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తగా బ్యాంకులు ఏటీఎంల్లో పూర్తిస్థాయిలో నగదును నింపడంతో వీటి కార్యకలపాలకు పెద్దగా ఆటంకాలు ఎదురుకాలేదు.

అలాగే ఈ సమ్మె నుంచి కో-ఆపరేటివ్ బ్యాంకులను మినహాయించడంతో, వాటి కార్యకలపాలు యధావిధిగా కొనసాగాయి. కొన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగస్తులకు ప్రైవేటు బ్యాంకులు మద్దతు ప్రకటించడమే కాకుండా లావాదేవీలకు దూరంగా ఉన్నట్లు యూనియన్ వర్గాలు చెప్పాయి.

 ఆగిన 10 కోట్ల చెక్ క్లియరెన్స్‌లు
 దేశవ్యాప్తంగా 8 లక్ష మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ప్రకటించింది. 27 ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 75,000 శాఖల్లో బ్యాంకింగ్ సేవలు ఆగిపోయినట్లు ఏఐబీఈఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశ్వాస్ తెలిపారు. ఈ సమ్మె కారణంగా 10 కోట్లకుపైగా చెక్కులు క్లియరెన్స్ ఆగిపోయాయని, సుమారుగా రూ. 15.5 కోట్ల లావాదేవీలకు ఆటంకం కలిగినట్లు యూనియన్లు పేర్కొన్నాయి. మోడీ సర్కారు వచ్చాక బ్యాంకు యూనియన్ల తొలి సమ్మె ఇది.

మరిన్ని వార్తలు