27,000 దాటితేనే సెన్సెక్స్‌కు స్థిరత్వం

15 Jun, 2015 02:51 IST|Sakshi
27,000 దాటితేనే సెన్సెక్స్‌కు స్థిరత్వం

దేశంలో పారిశ్రామికోత్పత్తి అంచనాలకంటే మించిందని, ద్రవ్యోల్బణం భయపడినంతగా పెరగలేదంటూ రెండు సానుకూల వార్తలు గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. అలాగే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత, ఇప్పటివరకూ సగటుకంటే 5 శాతం ఎక్కువగా వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. జూన్2 నాటి పాలసీ సమీక్షలో రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా, వర్షాభావం, ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనతోనే స్టాక్ మార్కెట్ 5 శాతంపైగా పడిపోయింది. ఈ భయాలు ప్రస్తుతానికి తొలగిపోయినందున, మార్కెట్ ఓవర్‌సోల్డ్ కండీషన్‌లో వున్నందున, ఈ వారం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీకి ఛాన్స్ వుంది. కానీ గ్రీసు-యూరోపియన్ యూనియన్ దేశాలు-ఐఎంఎఫ్‌ల మధ్య ఒక అంగీకారం కుదరక గత శుక్రవారం పశ్చిమ దేశాల మార్కెట్లు పడిపోయాయి. వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి కీలకమైన ఫెడ్ ప్రకటన ఈ బుధవారం వెలువడుతుందన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. ఈ కారణాలతో మార్కెట్ మరింత క్షీణించే ప్రమాదం కూడా వుంది.
 
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూన్ 12తో ముగిసిన వారంలో 27,000-26,307 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 343 పాయింట్ల నష్టంతో 26,425వద్ద ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 26,250 వద్ద తక్షణ మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 26,090 వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున కీలకమైన మద్దతు 25,900 స్థాయి. పెద్ద ప్రతికూల వార్త వెలువడితే తప్ప ఈ స్థాయిని సెన్సెక్స్ కోల్పోయే అవకాశాలు తక్కువ. ఈ స్థాయి దిగువన 25,200  వరకూ నిలువునా పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 26,470 పాయింట్ల స్థాయికి సూచీ చేరవచ్చు. ఆపైన ముగిస్తే 26,770 స్థాయిని అందుకునే వీలుంటుంది. రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు స్థిరత్వం రావాలంటే 27,000 పాయింట్లపైన కొద్దిరోజులపాటు ట్రేడ్‌కావాల్సివుంటుంది.
 
నిఫ్టీ తక్షణ మద్దతు 7,920-నిరోధం 8,030
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,160-7,940 మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 132 పాయింట్ల నష్టంతో 7,983 వద్ద ముగిసింది.  ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 8,030 స్థాయి నిఫ్టీకి స్వల్ప నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. అటు తర్వాత 8,100 స్థాయిని చేరొచ్చు. అటుపైన 8,150-8,190 కీలకమైన అవరోధ శ్రేణి. తదుపరి వారాల్లో 8,460 స్థాయిని అందుకోవాలంటే ఈ అవరోధ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించాల్సివుంటుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే  7,920 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 200 పాయిం ట్ల వరకూ పలు స్థాయిల వద్ద సాంకేతిక మద్దతులు నిఫ్టీకి వున్నందున, రానున్న రోజుల్లో మార్కెట్లను అతలాకుతలం చేసే ప్రతికూల వార్త ఏదైనా వెలువడితే తప్ప, 7,720 స్థాయిలోపునకు నిఫ్టీ తగ్గకపోవొచ్చు. 7,920 స్థాయిని ముగింపులో కోల్పోతే 7,850 వరకూ నిఫ్టీ క్షీణించవచ్చు.

మరిన్ని వార్తలు