మింగేసిన కొండ | Sakshi
Sakshi News home page

మింగేసిన కొండ

Published Mon, Jun 15 2015 2:47 AM

మింగేసిన కొండ

కొండలో రాళ్లను తీసి తండ్రి, కొడుకు జీవనం సాగించే వారు.. రోజూ మాదిరే పని చేస్తుండగా మట్టిగడ్డలు విరిగిపడి కుమారుడిని కప్పేశాయి.. ఈ సంఘటనను చూసిన తండ్రికి కాసేపు నోట మాట రాలేదు.. వెంటనే తేరుకుని ఎలాగైనా రక్షించుకోవాలని ఇద్దరి సాయంతో మట్టిని తీసేశాడు.. అప్పటికే కుమారుడు మృత్యువాత   పడటంతో బోరున విలపించాడు.
 
 కలసపాడు : ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన తంబతక్క చిన్న నరసింహులు బతుకు దెరువు కోసం 30 ఏళ్లుగా కొండను నమ్ముకుని బేస్ మట్టం రాళ్లు, మురుగు గుంతలపై మూతరాళ్లు తీసుకుంటూ జీవనం వాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడికి పెళ్లి అయింది. ఆయన తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టుకుని బతుకుతున్నాడు. చిన్న కుమారుడు సిద్దయ్యను తనకు తోడుగా తీసుకుని పోయి రాళ్లను తీసుకునే వాడు. సిద్దయ్య(26)కు ఇంకా పెళ్లి కాలేదు. రోజూ లాగే శనివారం ఉదయం గనిలో రాళ్లను తీసేందుకు తిరుమల కొండస్వామి దగ్గరకు తండ్రితో కలిసి వెళ్లాడు. అప్పటికే బండెడు రాళ్లను గని నుంచి తీసి బయట వేశారు.

 ఉన్నట్లుండి.. మట్టిపెళ్లలు విరిగిపడి..
 తండ్రి ఒక వైపు, సిద్దయ్య మరోవైపు (ఇద్దరు దగ్గర దగ్గరనే) రాళ్లు తీస్తుండగా ఉన్నట్లు ఉండి పైన ఉన్న మట్టిపెళ్లలు విరిగి సిద్దయ్యను పూర్తిగా కప్పేశాయి. కళ్లేదుటనే కుమారుడు మట్టిపెళ్లల కింద పడి కన్పించకుండా పోవడంతో నరసింహులు నిర్ఘాంతపోయాడు. చివరికి కుమారుడిని రక్షించుకునేందుకు మట్టిని తొలగించే ప్రయత్నం చేశాడు. ఆలయం దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులకు విషయం తెలిపాడు. పారలతో మట్టిని తొలగించి సిద్దయ్యను బయటికి తీశారు. అప్పటికే ఆయన మరణించాడు.

నరసింహులు బోరున విలపిస్తూ గ్రామానికి పరుగు పరుగున వచ్చి కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరం తెలిపారు. కొడుకు మరణవార్త విన్న తల్లి మహలక్షుమ్మ కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. సిద్దయ్యను చూసేందుకు ముసల్‌రెడ్డిపల్లె గ్రామస్తులు కొండ దగ్గరకు తరలి వెళ్లారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం గ్రామానికి వెళ్లి సిద్దయ్య మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు.
 
 మట్టిగడ్డలు తీస్తానన్నా.. వద్దన్నాడు:
 కింద రాళ్లను తీసేందుకు పైన ఉన్న మట్టిగడ్డలు తీసివేస్తానని చెప్పాను. మట్టిపెళ్లలు తీస్తే నీడ పోతుందని, తీయవద్దని చెప్పాడు. మరో పది నిమిషాలకే మట్టిపెళ్లలు పడి తొలి కూతలోనే చనిపోయాడు. చేసేందుకు ఏ పని లేక 30 ఏళ్ల నుంచి రాళ్లను తీసుకుంటూ బతుకుతున్నాం. ముసలి ముతకన మాకు అన్నం పెడతాడనుకున్న బిడ్డ నా కళ్ల ముందే రాలి పోయిండు.
 -టి.నరసింహులు, సిద్దయ్య తండ్రి, ముసల్‌రెడ్డిపల్లె

Advertisement
Advertisement