కెరీర్‌లో తొలిసారి.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

11 Apr, 2018 09:13 IST|Sakshi
అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందు జుకర్‌బర్గ్‌

వాషింగ్టన్‌ : ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన కెరీర్‌లో మొదటిసారి అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందుకు వచ్చారు. ఫేస్‌బుక్‌ డేటా చోరిపై ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెల్లుబుక్కుతున్న ఆగ్రహ జ్వాలలపై జుకర్‌బర్గ్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌కు క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్‌, అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందు చెప్పడం ఇదే తొలిసారి. అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన జుకర్‌బర్గ్‌, చట్టసభ్యులు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో నేడు కూడా జుకర్‌బర్గ్‌ హౌజ్‌ ఎనర్జీ, కామర్స్‌ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. 

ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో ప్రస్తుతం జుకర్‌బర్గ్‌ అతలాకుతలమవుతున్నారు. దాదాపు 8.7  కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్‌ న్యూస్‌, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్‌ సోషల్‌ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారం లీక్‌ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్‌ ఒప్పుకున్నారు. ‘ఇది నా తప్పే. క్షమాపణలు చెబుతున్నా. ఫేస్‌బుక్‌ నేనే ప్రారంభించా. నేనే నడుపుతున్నా. కాబట్టి జరిగిన దీనికి నేనే బాధ్యత’ అంటూ పశ్చాతాపానికి గురయ్యారు. కేంబ్రిడ్జ్‌ అనలిటికా కూడా దీనిపై ఓ ట్వీట్‌ చేసింది. ఫేస్‌బుక్‌ను తాము హ్యాక్‌ చేయలేదని లేదా చట్టాలనూ ఉల్లంఘించలేదని పేర్కొంది. ఫేస్‌బుక్‌ అందించిన టూల్‌ ద్వారానే అమెరికా ఎన్నికల సందర్భంగా తాము ఈ డేటాను సేకరించామని చెప్పింది.  

ఫేస్‌బుక్‌ గుత్తాధిపత్యంపై చట్టసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన.. తమ కంపెనీ గుత్తాధిపత్యం కలిగి ఉందని భావించవద్దని జుకర్‌బర్గ్‌ చట్టసభ్యులను కోరారు. అమెరికన్‌ యూజర్లు తమ స్నేహితులతో సంభాషించడానికి, ఎప్పడికప్పుడు అందుబాటులో ఉండటానికి సగటున ఎనిమిది యాప్స్‌ను వాడుతున్నారని, వాటిలో టెక్ట్సింగ్‌ యాప్స్‌ నుంచి ఈ-మెయిల్‌ వరకు ఉన్నాయన్నారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొంత మంది రష్యాకు చెందిన గ్రూప్‌లు సోషల్‌ నెట్‌వర్క్‌ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వారిపై తాము పోరాడుతున్నామని చెప్పారు. వారు తమ సిస్టమ్స్‌ను, ఇతర ఇంటర్నెట్‌ సిస్టమ్స్‌ను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కానీ వారి బారిన పడకుండా ఉండటానికి తాము శతవిధాలా కృషిచేస్తున్నామన్నారు. అమెరికా కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన మార్క్‌ జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలను చట్టసభ్యులు సంధించారు. అమెరికా కాంగ్రెస్‌ హాజరయ్యే ముందు జుకర్‌బర్గ్‌ ఉన్న హోటల్‌ గదిలో ఎలా ఉందని దగ్గర్నుంచి... ఆయన మెసేజ్‌లు చేసిన స్నేహితుల వివరాల వరకూ... అన్ని విషయాలను జుకర్‌బర్గ్‌ను చట్టసభ్యులు అడిగారు.

మరిన్ని వార్తలు