అమెజాన్‌ కొం‍పముంచిన కోడ్‌.. స్టూడెంట్స్‌కు పండగ

29 Oct, 2019 16:45 IST|Sakshi

 తొమ్మది రోజులు పాటు అడ్డూ అదుపు లేకుండా కొనుగోలు చేసిన యూకే విద్యార్థులు

లండన్‌: ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం.. ఏం కావాలన్నా బయటకు వెళ్లనవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ ఇస్తున్నారు. ఈ-కామర్స్‌ సంస్థలు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పెద్ద మొత్తంలో భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. భారత్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్‌లో డిస్కౌంట్‌ ఆఫర్‌లతో భారీగా విక్రయాలు సాగిస్తున్నాయి. రోజురోజుకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ పుంజుకుని.. మార్కెట్‌ బలపడుతున్న తరుణంలో కొన్నిసార్లు.. ఆయా వెబ్‌సైట్‌లలో లోపాల కారణంగా సంస్థలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ స్టూడెంట్ డీల్‌లో.. డిస్కౌంట్‌ కోడ్‌లోని లోపం కారణంగా అమెజాన్‌ సంస్థకు నష్టం జరిగిన విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 

ఇటీవల ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యూకేలోని కొత్త కస్టమర్లకు మొదటి కొనుగోలుపై 5 పౌండ్‌లు డిస్కౌంట్‌ ఇచ్చింది. అమెజాన్‌ సంస్థ 'వెల్‌కమ్‌5' అనే పేరుతో ఇచ్చిన డిస్కౌంట్‌ ఆఫర్‌ఫై ఎలాంటి షరతులు పెట్టకపోవడంతో ఒకే కోడ్‌పై వినియోగదారులు అనేకసార్లు విక్రయాలు జరిపి సంస్థకు నష్టం మిగిల్చారు. డిస్కౌంట్‌ కోడ్‌లో లోపమున్న కారణంగా ఒకే వినియోగదారుడు ఆఫర్‌ను అనేకసార్లు ఉపయోగించవచ్చనే విషయం కంపెనీకి 9 రోజుల పాటు తెలియకపోవడం గమనార్హం. 

అమెజాన్ డిస్కౌంట్ కోడ్‌లో లోపాన్ని గుర్తించిన యూకే విద్యార్థులు, డిస్కౌంట్‌ కోడ్‌ను తెగ వాడేసుకుని లాభపడ్డారు. డిస్కౌంట్ కోడ్‌ను ఉపయోగించి ఎన్ని సార్లయినా కొత్త వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్‌ పొందవచ్చని కనుగొన్న కొందరు విద్యార్థులు మొత్తం క్యాంపస్‌ లైఫ్‌కు సరిపడా వస్తువులు భారీ మొత్తంలో కొనిపడేశారు. ఇక డిస్కౌంట్‌ కోడ్‌లో ఉన్న లోపం గురించి ఆ నోటా ఈ నోటా పడి యూకేలోని అన్ని క్యాంపస్‌లకు పాకింది. దీంతో వందలాది మంది విద్యార్థులు టాయిలెట్ రోల్స్, టూత్‌పేస్టులు, బీర్ ప్యాక్‌లను పెద్దమొత్తంలో ఆర్డర్ చేసి పూర్తి ప్రయోజనం పొందారు. మరి కొంతమంది విద్యార్థులు మాత్రం ఈ లోపాన్ని ఒక వ్యసనంలా.. ఆటలా భావించి.. ఎప్పటికీ కొనవలసిన అవసరం లేకుండా.. టాయిలెట్ రోల్స్, టూత్‌పేస్టులు, బీర్ ప్యాక్‌లు, నవలలు, పెన్నులు, ఫోల్డర్‌లు, బ్యాటరీలు కొన్నామని పేర్కొన్నారు. అయితే 9 రోజుల తర్వాత లోపాన్ని గుర్తించిన అమెజాన్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోడ్‌ లోపంతో ఎంతమేరకు నష్టం వచ్చిందన్నది వెల్లడి కాలేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు