వారంలో భారీగా పెరిగిన పుత్తడి

23 Aug, 2015 23:54 IST|Sakshi
వారంలో భారీగా పెరిగిన పుత్తడి

ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో పటిష్టమైన ట్రెండ్‌తో పాటు డాలరుతో రూపాయి మారకపు విలువ క్షీణించడంతో గతవారం దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. గతవారం ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 1,345 లాభపడి రూ. 27,225 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల బంగారం ధర అంతే లాభంతో రూ.27,075 వద్ద ముగిసింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 47 డాలర్ల వరకూ పెరిగి 1,159 డాలర్ల వద్ద క్లోజయ్యింది.

చైనా కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయని, దాంతో సురక్షిత సాధనంగా పుత్తడివైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీరేట్లు పెంచకపోవొచ్చన్న అంచనాలూ పసిడి ర్యాలీకి కారణమంటున్నారు.

>
మరిన్ని వార్తలు