స్థిర శ్రేణిలో బంగారం!

4 Dec, 2017 01:27 IST|Sakshi

1,260–1,300 డాలర్ల మధ్య ఊగిసలాట

మూడు నెలల నుంచీ ఇదే పరిస్థితి

సమీప కాలంలోనూ ఇదే ధోరణి అంటున్న విశ్లేషకులు  

అమెరికా ఫెడరల్‌ వడ్డీరేట్ల (ప్రస్తుతం 1–1.25 శాతం) పెంపుపై సందేహాలు... 95 – 92.50 మధ్య శ్రేణిలో డాలర్‌ ఇండెక్స్‌ కదలికలు... మధ్యలో కొంత ఒడిదుడుకులకు గురయినా ఈక్విటీ మార్కెట్ల బులిష్‌ ధోరణి... ఉత్తరకొరియా ఉద్రిక్తతల యథాతథ వాతావరణం... వంటి అంశాలు పసిడిని స్థిర శ్రేణిలో ఉంచుతున్నాయి. గడచిన మూడు నెలల నుంచీ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని, పసిడి కదలికలు 1,260–1,310 డాలర్ల మధ్య ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

డిసెంబర్‌ 1వ తేదీతో ముగిసిన వారంలో పసిడి  అంతర్జాతీయ న్యూయార్క్‌ కమోడిటీ  ఎక్సే్చంజ్‌ నైమెక్స్‌లో ధర ఔన్స్‌ (31.1గ్రా)కు 8 డాలర్లు తగ్గి 1,280 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి అంతకుముందు వారం 10 డాలర్లు తగ్గింది.   ప్రస్తుతం 40 డాలర్ల శ్రేణిలో పసిడి కన్సాలిడేట్‌ అవుతోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. 1,250 డాలర్ల స్థాయి లోపునకు పడిపోయేంత వరకూ పసిడి ఫండమెంటల్స్‌ పటిష్టంగానే ఉన్నట్లు భావించవచ్చనేది నిపుణుల అంచనా.

అమెరికా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఉత్తర కొరియా సహా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం పసిడిది బులిష్‌ ధోరణే అన్న అంచనాలకు బలాన్నిస్తాయని వారు చెబుతున్నారు. పన్నులకు సంబంధించి అమెరికా తీసుకునే చర్యలు పసిడి కదలికలను నిర్దేశించే అంశాల్లో ముఖ్యమైనవి. 1,310 డాలర్లు, 1,325 డాలర్లు పసిడికి కీలకమని, ఈ నిరోధాన్ని దాటితే తిరిగి పుత్తడి పూర్తిస్థాయిలో బులిష్‌ జోన్‌లోకి వచ్చినట్లేనని వారు పేర్కొంటున్నారు.


దేశంలోనూ వెనుకంజే...
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా కనబడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌– ఎంసీఎక్స్‌లో వారంలో పసిడి ధర వరుసగా రెండవ వారమూ తగ్గింది. వారంలో రూ.171 తగ్గి రూ.29,209కి చేరింది. ఇక ముంబై స్పాట్‌ మార్కెట్‌లో వారం వారీగా ధర రూ 190 తగ్గింది. 99.9 స్వచ్ఛత రూ.190 తగ్గి రూ. 29,400 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పడిపోయి రూ.29,250కి పడింది. ఇక వెండి ధర కేజీకి  రూ. 1,265 పడిపోయి రూ. 38,070 వద్ద ముగిసింది. ఇక డాలర్‌ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వారంలో ఐదు పైసలు బలపడి 64.55 నుంచి 64.50కు చేరింది.  

మరిన్ని వార్తలు