విలీనం దిశగా పీఎస్‌యూ బ్యాంకులు

2 Jan, 2015 00:20 IST|Sakshi
విలీనం దిశగా పీఎస్‌యూ బ్యాంకులు

నేటి నుంచి బ్యాంకింగ్ సంస్కరణలపై పూణేలో రెండు రోజుల కీలక సదస్సు
లిస్ట్ అయిన అనుబంధ బ్యాంకుల వీలీనంపై ఎస్‌బీఐ దృష్టి
తొలి జాబితాలో యునెటైడ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్!

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో కీలకమైన సంస్కరణలకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పూణే కేంద్రంగా జనవరి 2, 3 తేదీల్లో  రెండు రోజుల పాటు ‘జ్ఞాన సంగం’ పేరుతో ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలతో పాటు, అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, పేరుకుపోయిన మొండి బకాయీలను తగ్గించడం, బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా కావల్సిన మూలధన ఏర్పాటు వంటి కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలే ప్రధాన అజెండా అయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సీఎండీలు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో పాటు, ఐఆర్‌డీఏ, పీఎఫ్ ఆర్‌డీఏ చైర్మన్లు, పాల్గొననున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించే ఈ సమావేశాలు రెండో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగుస్తాయి. మోదీ ఈ సందర్భం గా బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ఒక ముసాయిదాను విడుదల చేయడం తో పాటు, పీఎస్‌యూ బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడానికి ప్రభుత్వం, బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకు సీఎండీలతో చర్చించనున్నారు.
 
విలీనాలకే మొగ్గు
జూలై బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించిన అరుణ్ జైట్లీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జ్ఞాన సంగం సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా వీటిని విలీనం చేయడం ద్వారా 7-8 పెద్ద బ్యాంకులుగా తీర్చిదిద్దాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది ఒకటి రెండు బలహీనమైన బ్యాంకులను బలమైన బ్యాంకులో విలీనం చేయడంతో పాటు, ఒక ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకును విలీనం చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇందులో భాగంగా తొమ్మిది నెలలుగా సీఎండీ లేకుండా, రూ. 10 లక్షలు దాటి రుణాలు కూడా ఇవ్వడానికి వీలులేని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈ ప్రక్రియ మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది. యునెటైడ్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక బ్యాంకు ఉన్నతాధికారి పేర్కొన్నారు. దీని తర్వాత గత త్రైమాసికంలో నష్టాలు ప్రకటించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా, విజయ, యూకో వంటి బ్యాంకుల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు