బడ్జెట్‌కు ముందు భేటీ : రిలీఫ్‌ ఉండొచ్చు

16 Jan, 2018 19:23 IST|Sakshi

న్యూఢిల్లీ : గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) కౌన్సిల్‌ 25వ సమావేశం ఈ నెల 18న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరుగబోతుంది. మోదీ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన బడ్జెట్‌కు కాస్త ముందుగా ఈ సమావేశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం తమ చివరి బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ప్రవేశపెడుతుంది. బడ్జెట్‌కు ముందుగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగబోతుండటంతో, పలు ఊరటనిచ్చే ప్రకటనలు వెలువడే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను, రిటర్నుల ఫైలింగ్‌ను, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లయిమ్‌ చేసుకోవడం వంటి ప్రక్రియలను జీఎస్టీ కౌన్సిల్‌ సులభతరం చేయనుందని తెలుస్తోంది. 

జీఎస్టీ కౌన్సిల్‌ చివరి సమావేశం డిసెంబర్‌ 16న జరిగింది. ఆ సమావేశంలో నిర్ణయించిన అంతరాష్ట్రాల ఈ-వే బిల్లు 2018 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతుంది. జీఎస్టీను అనుసరించి ఏవేనీ రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే ఫిబ్రవరి 1 నుంచి ఈ-వే బిల్లు తప్పనిసరని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు