హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 5,006 కోట్లు

21 Oct, 2018 02:10 IST|Sakshi

24 శాతం పెరిగిన రుణ వృద్ధి

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 21 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,151 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5,006 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం, ఇతర, నిర్వహణ ఆదాయాలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. కేటాయింపులు పెరగడం వల్ల లాభదాయకత తగ్గినట్లు తెలిపింది.

నికర వడ్డీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.11,763 కోట్లకు, ఇతర ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.4,016 కోట్లకు పెరిగాయని,  నికర వడ్డీ మార్జిన్‌ 4.1 శాతంగా ఉందని తెలిపింది. నిర్వహణ లాభం 21 శాతం పెరిగి రూ.9,480 కోట్లకు చేరాయి.  రుణాలు 24 శాతం వృద్ధితో రూ.7.50 లక్షల కోట్లకు, డిపాజిట్లు 21 శాతం వృద్ధితో రూ.8.33 లక్షల కోట్లకు చేరాయి. రుణ నాణ్యత స్థిరంగా ఉందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు ఫ్లాట్‌గా 1.33 శాతంగా ఉన్నాయని, ఈ క్యూ1లో 0.41 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 0.4 శాతానికి తగ్గాయని పేర్కొంది. కేటాయింపులు 23 శాతం (సీక్వెన్షియల్‌గా చూస్తే 12 శాతం) పెరిగి రూ.1,820 కోట్లకు చేరాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు