బ్యాంకు ‘నెట్‌’లోకి వెళ్లాల్సిందే!

5 Feb, 2017 23:57 IST|Sakshi
బ్యాంకు ‘నెట్‌’లోకి వెళ్లాల్సిందే!

ఇక బ్రాంచిలో జరిపే లావాదేవీలకు పరిమితులు
నెలకు నాలుగైదు దాటితే ప్రతి లావాదేవీకి భారీ చార్జీలు
డిజిటల్‌ బ్యాంకింగ్‌ను తప్పనిసరి చేస్తున్న బ్యాంకులు
ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాంకింగ్‌లో నగదు బదిలీకి పలు మార్గాలు
►  నెఫ్ట్‌ నుంచి యూపీఐ దాకా... అన్నిటికీ చార్జీలు; వాటి మధ్య తేడాలు  


రెండ్రోజుల కిందట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఒక ప్రకటన చేసింది. ‘మీరు బ్యాంకు బ్రాంచికి వచ్చి గనక లావాదేవీలు జరిపితే... నెలకు నాలుగు  మాత్రమే ఉచితం. అది దాటితే లావాదేవీకి రూ.150 చొప్పున వసూలు చేస్తాం’ అనేది దాని సారాంశం. అంటే బ్యాంకుకు నగదు డిపాజిట్‌ చెయ్యటానికి వెళ్లినా, విత్‌డ్రా చెయ్యటానికి వెళ్లినా... ఇవన్నీ లావాదేవీలే కనక నెలకు నాలుగు మాత్రమే ఉచితం. అది దాటితే బాదుడే. దీనర్థం ఒక్కటే. ‘‘మీరు బ్యాంకుకు రాకండి. కావాలంటే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో ఎన్ని లావాదేవీలైనా చేసుకోండి’’ అంతే. కేంద్ర ప్రభుత్వం మెల్లగా క్యాష్‌లెస్‌... అంటూ అందరినీ డిజిటల్‌ వైపు మళ్లిస్తోంది. దానికి అనుగుణంగా బ్యాంకులు బలవంతంగా అందరినీ డిజిటల్‌ వైపు నడిపించటానికి కంకణం కట్టుకున్నట్లున్నాయి. ఈ ప్రకటనను కూడా దాన్లో భాగంగానే భావించాలి. సరే! మరి ఇంటర్నెట్‌ బ్యాంకింగో, మొబైల్‌ బ్యాంకింగో చెయ్యాలంటే కావాల్సిందేంటి? అసలు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఒక ఖాతా నుంచి వేరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయటానికి ఏఏ పద్ధతులున్నాయి? ఇంకా ప్రభుత్వం తెచ్చిన భీమ్‌ యాప్‌ వంటివి ఎలా పనిచేస్తాయి? ఇలా బదిలీ చేసేటపుడు చార్జీలేమైనా వసూలు చేస్తారా? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం..

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌ చేయటానికి మొట్టమొదట కావాల్సింది నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌. దీనికోసం మీ బ్యాంకు బ్రాంచిని సంప్రదిస్తే యూజర్‌ ఐడీ వారే ఇస్తారు. పాస్‌వర్డ్‌ను కొన్ని పోస్టల్‌లో పంపిస్తుండగా... మీ పుట్టినతేదీ, ఓటీపీ సాయంతో మీ పాస్‌వర్డ్‌ను మీరే ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని మరికొన్ని బ్యాంకులిస్తున్నాయి. దీనికోసం మీ మొబైల్‌ నంబర్‌ను మీ ఖాతాతో బ్యాంకు ద్వారా అనుసంధానం చేయటం మాత్రం తప్పనిసరి. మున్ముందు మీ ఆధార్‌ను బ్యాంకులో అనుసంధానం చేసి... మొబైల్, నెట్‌ బ్యాంకింగ్‌ ఏవీ లేకున్నా కూడా  వేలిముద్ర సాయంతో చెల్లింపులు జరిపే అవకాశం కూడా రాబోతోంది. అయితే దీనికి ముందుగా మీ ఆధార్‌ను మీ బ్యాంకుతో అనుసంధానం చేయటం తప్పనిసరి. ఇక వేరొకరి ఖాతాలోకి ఆన్‌లైన్లో నగదు బదిలీ చేయటానికిపుడు రకరకాల పద్ధతులున్నాయి. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ, భీమ్‌ యాప్‌ వంటివన్నీ నేరుగా బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీకి వీలు కల్పించేవే. కాకపోతే చార్జీల విషయంలో తేడాలతో పాటు దేని పరిమితులు దానికున్నాయి.  అవేంటో ఒకసారి చూద్దాం.

ఐఎంపీఎస్‌
ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌) అనేది వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటలూ అందుబాటులో ఉండే విధానం. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ దీన్ని 2010లో ఆవిష్కరించింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ విధానంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ మాదిరిగానే ఇదీ. ఈ సౌకర్యానికి బ్యాంకు వద్ద పత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన పనిలేదు. నెట్‌ బ్యాంకింగ్‌లో నగదు బదిలీ చేసే చోటే ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ఏది కావాలన్నది ఖాతాదారుడి ఇష్టం.

లావాదేవీ ఇలా...  
ఐఎంపీఎస్‌ విధానంలో బెనిఫీషియరీకి నగ దు పంపించాలనుకుంటే సంబంధిత వ్యక్తి ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌ కోడ్, బ్యాంకు శాఖ వివరాలతో యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌ బ్యాంకింగ్‌కు మాత్రం ఈ ఇబ్బంది లేదు. మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఐఎంపీఎస్‌ విధానంలో నగదు పంపాలనుకుంటే బెనిఫీషియరీ నంబర్, మొబైల్‌ మనీ ఐడెంటిఫయర్‌ (ఎంఎంఐడీ) కోడ్‌ ఉంటే సరిపోతుంది. రూ.లక్ష వరకు లావాదేవీలపై రూ.5 చార్జీ ఉంటుంది. ఆపై రూ.2 లక్షల వరకు చార్జీ రూ.15 ఉంటుంది. దీనికి సర్వీస్‌ ట్యాక్స్‌ అదనం. ఈ చార్జీలు కూడా బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఈ విధానంలో గరిష్టంగా రూ.2 లక్షల వరకే నగదు బదిలీకి వీలుంటుంది.

ఆర్టీజీఎస్‌
రియల్‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్టీజీఎస్‌) అనేది అధిక విలువ గల లావాదేవీలకు ఉద్దేశించిన విధానం. కనీ సం రూ.2 లక్షలు ఆపైనే నగదు బదిలీ చేసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. లావాదేవీ పూర్తయిన అరగంటలోపు బెనిఫిషియరీ ఖాతాకు జమ అయిపోతుంది. పనిదినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు, శనివారాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఆర్టీజీఎస్‌ విండో తెరిచి ఉంటుంది. ఈ సమయం తర్వాత చేసిన లావాదేవీ మరుసటి పని దినం ప్రారంభ సమయంలో పూర్తవుతుంది. మిగతా ప్రక్రియంతా ఎన్‌ఈఎఫ్‌టీ మాదిరే ఉంటుంది. లావాదేవీ చార్జీలు బ్యాంకులను బట్టి మారుతాయి. రూ. 2–5 లక్షల వరకు రూ.30, రూ.5 లక్షల పైన రూ.55 వరకు చార్జీ ఉంది.

పరిమితులు
లావాదేవీకి గాను నగదు పంపే వ్యక్తి, అందుకునే వ్యక్తి బ్యాంకు శాఖల్లో ఆర్టీజీఎస్‌ సదుపాయం ఉండాలి. ఆర్టీజీఎస్‌ సదుపాయం ఉన్న శాఖల వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. సెలవు రోజులు, ఆదివారాల్లో ఈ సదుపాయం ఉండదు.

యూపీఐ
యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) అనేది ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన సరికొత్త విధానం. ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల యుగం కనకే దీన్ని తేవటం జరిగింది. స్మార్ట్‌ఫోన్లో యూపీఐ ఆధారిత బ్యాంకు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా సులభంగా, సత్వరమే నగదు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏడాది పొడవునా, రోజులో అన్ని వేళలా ఈ విధానం పనిచేస్తుంది. బ్యాంకు పేరు, ఖాతాదారుడి పేరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఇలాంటి వివరాలేం అవసరం లేదు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక లాగిన్‌ అవ్వాలి. ఖాతా నంబర్‌ ఇవ్వడం ద్వారా వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ అంటే ఉదాహరణకు  టటజీఃటbజీ ఇలా.

నగదు బదిలీ
యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయాలనుకుంటే యాప్‌ను ఓపెన్‌ చేశాక ఆరు అంకెల పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. తర్వాత యూపీఐ ఆప్షన్‌ ఎంచుకుని ‘పే టూ వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌’ను క్లిక్‌ చేయాలి. నగదు అందుకోవాల్సిన వ్యక్తి వర్చువల్‌ ఐడీ ఒక్కటి ఉంటే చాలు అర నిమిషం లోపే నగదు పంపించేయవచ్చు. బెనిఫీషియరీ వర్చువల్‌ ఐడీని ఎంటర్‌ చేసి, ఎంత మొత్తం పంపదలిచినదీ నమోదు చేయాలి. ఓకే చేసిన తర్వాత అవే వివరాలను మరోసారి ధ్రువీకరించటం ఆలస్యం... లావాదేవీ జరిగిపోతుంది. దుకాణదారుడికి నగదు చెల్లించాలన్నా, వ్యక్తులకు నగదు బదిలీ చేయాలన్నా ఇలానే. యూపీఐ యాప్‌ ద్వారా వ్యక్తుల మధ్య జరిగే నగదు బదిలీ సేవలపై చార్జీల్లేవు. దుకాణాల్లో చెల్లింపులపై మాత్రం రూ.15 వరకు చార్జీ ఉంటుంది. దీన్ని కూడా వ్యాపారే చెల్లించాలి. డీమోనిటైజేషన్‌ తర్వాత ఈ ఛార్జీల్ని కూడా రద్దు చేశారు.

పరిమితులు
యూపీఐ మార్గదర్శకాల ప్రకారమైతే రోజుకు రూ.లక్ష వరకు నగదు బదిలీ లేదా చెల్లింపుల పరిమితి ఉంది. కొన్ని బ్యాంకులు సొంతంగా పరిమితులు విధిస్తున్నాయి.

ఎన్‌ఈఎఫ్‌టీ
నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌. చాన్నాళ్లుగా అందుబాటులో ఉంది. డిఫర్డ్‌ సెటిల్‌మెంట్‌ విధానంలో పనిచేస్తుంది. అంటే లావాదేవీలు తక్షణమే పూర్తి కావు. బ్యాచ్‌ల వారీగా నిర్ణీత సమయానికి ఓసారి జరుగుతాయి. సోమవారం– శుక్రవారం మధ్య రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 సెటిల్‌మెంట్లు... శనివారం మాత్రం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరు సెటిల్‌మెంట్లు జరుగుతాయి. నగదు బదిలీపై పరిమితి లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం పరిమితులు విధించాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ రిటైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాదారులకు ఎన్‌ఈఎఫ్‌టీ గరిష్ఠ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.

లావాదేవీ జరిపేదిలా...
నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉండాలి. మొబైల్‌ నంబర్‌ను బ్యాంకులో రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి. ఎవరికైతే నగదు పంపాలని అనుకుంటున్నామో సంబంధిత వ్యక్తి పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ లేదా బ్యాంకు శాఖ పేరును ముందుగానే తెలుసుకుని ‘పేయీ’గా యాడ్‌ చేసుకోవాలి. పేయీ వివరాల్ని బ్యాంకు ధ్రువపరచి, యాక్టివేట్‌ చేస్తుంది. యాక్టివేషన్‌కు ఎంత సమయం పడుతుందన్నది బ్యాంకును బట్టి మారుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు అయితే బెనిఫీషియరీని యాడ్‌ చేసిన అర గంటకు నగదు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్‌బీఐ అయితే నాలుగు గంటలు. అదీ కూడా పని వేళల్లోనే ఈ సమయపాలన వర్తిస్తుంది. వివరాల్ని బ్యాంకు ధ్రువపరిచాక నెట్‌బ్యాంకింగ్‌లో లాగిన్‌ అయి... ట్రాన్స్‌ఫర్‌ ఫండ్స్‌ ఆప్షన్‌ ఎం చుకోవాలి. పేయీని ఓకే చేసి, ఎంత నగదు పంపాలంటే అంత పంపొచ్చు. మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తదుపరి సెటిల్‌మెంట్‌లో నగదు బెనిఫీషియరీ ఖాతాకు జమ అయిపోతుంది. లావాదేవీ చార్జీ రూ.2.50 నుంచి రూ.25 వరకు, అదనంగా సర్వీస్‌ ట్యాక్స్‌ ఉంటుంది.

ప్రతికూలతలు
నగదు బదిలీ సత్వరమే జరగదు. సెలవుదినాల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. పనిదినం వరకు వేచి చూడాల్సిందే.

యూఎస్‌ఎస్‌డీ 99#
అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డేటా (యూఎస్‌ఎస్‌డీ) సాధారణ మొబైల్‌ ఫోన్ల సాయంతో నగదు బదిలీలకు వీలు కల్పించే సులభ విధానమిది. మొబైల్‌ కీప్యాడ్‌పై ూ99# డయల్‌ చేసి నగదు బదిలీ, నగదు నిల్వల సమాచారం, మినీ స్టేట్‌మెంట్‌ వంటి సేవలు ఏడాది పొడవునా రోజులో ఎప్పుడైనా పొందొచ్చు. జీఎస్‌ఎం ఫోన్‌ ఉండి, మొబైల్‌ నంబర్‌ను బ్యాంకులో నమోదు చేసుకుని ఉంటే చాలు. అలాగే, బ్యాంకు జారీ చేసే ఏడంకెల ఎంఎంఐడీ కోడ్‌ కూడా అవసరం. నగదు అందుకోవాలనుకునే వ్యక్తి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఖాతా నంబర్‌ తెలుసుకోవాలి. లేదా ఆధార్‌ నంబర్‌ ఉన్నా సరిపోతుంది.

యూఎస్‌ఎస్‌డీ ఇలా...
మొబైల్‌ నుంచి 99# డయల్‌ చేయాలి. తర్వాత వచ్చే వెల్‌కమ్‌ స్క్రీన్‌లో బ్యాంకు పేరులోని మొదటి మూడు అక్షరాలు లేదా బ్యాంకు శాఖ ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్‌లోని మొదటి నాలుగు అంకెలు నమోదు చేయాలి. ఆ తర్వాత సేవల చిట్టా కనిపిస్తుంది. ఖాతాలో నగదు బ్యాలన్స్‌ తెలుసుకునేందుకు (1), మినీ స్టేట్‌మెంట్‌ (2), ఎంఎంఐడీ, మొబైల్‌ నంబర్‌ ద్వారా నగదు బదిలీకి (3), ఐఎఫ్‌ఎస్‌సీ, ఖాతా నంబర్‌తో నగదు బదిలీకి(4), బెనిఫీషియరీ ఆధార్‌ నంబర్‌ సాయంతో నగదు బదిలీకి(5), ఎంఎంఐడీ తెలుసుకునేందుకు(6) ఇలా ఆప్షన్‌ ఎంపిక చేసుకుని సంబంధిత సేవలను పొందవచ్చు.  

చార్జీలు
ఒక లావాదేవీకి గరిష్టంగా రూ.1.50 పరిమితిని ట్రాయ్‌ విధించింది. ఆపరేటర్‌ను బట్టి ఇది కొంచెం మారొచ్చు. ఇతరత్రా ఎటువంటి చార్జీల్లేవు. రోమింగ్‌లో ఈ సేవను వాడుకున్నా అదనపు చార్జీలు ఉండవు.

పరిమితులు
నెట్‌వర్క్‌ సిగ్నల్‌ అందుబాటులో ఉండాలి. రోజుకు రూ.5వేలకు మించి పంపేందుకు అవకాశం లేదు.

భీమ్‌ యాప్‌
నేషనల్‌పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆవిష్కరించిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ను ఆధారం చేసుకుని భీమ్‌(భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ)యాప్‌ పనిచేస్తుంది. డిజిటల్‌ చెల్లింపులను పెంచేందుకు ప్రభుత్వం డీమోనిటైజేషన్‌ తరవాత దీన్ని తీసుకొచ్చింది. మొబైల్‌ వాలెట్‌ మాదిరిగా పనిచేస్తుంది కానీ, వ్యాలెట్‌ కాదు. నేరుగా బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. ఈ యాప్‌ సాయంతో రెండు బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీలు, దుకాణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఎంఎంఐడీ కోడ్, క్యూఆర్‌ మార్గాల్లోనూ నగదు చెల్లింపులు చేయవచ్చు. మీ కంటూ క్యూఆర్‌ కోడ్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. దుకాణంలో నగదు చెల్లించాలనుకున్నప్పుడు ఈ క్యూఆర్‌ కోడ్‌ చూపించినట్టయితే దాన్ని స్కాన్‌ చేసుకుంటారు. అనంతరం మీ ఖాతా నుంచి దుకాణదారుడి ఖాతాకు నగదు వెళ్లిపోతుంది. దాదాపు అన్ని బ్యాంకులు భీమ్‌ యాప్‌ను సపోర్ట్‌ చేస్తున్నాయి.

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌ ప్రక్రియ ముగిశాక నాలుగంకెల పాస్‌ కోడ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఖాతా కలిగిన బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. దాంతో యాప్‌ తనంతట తానే మొబైల్‌ నంబర్‌ ఆధారంగా ఖాతా వివరాలను సేకరిస్తుంది. అన్ని లావాదేవీలకు ప్రైమరీ ఖాతా ఏదన్నది పేర్కొనాలి. సెండ్, రిక్వెస్ట్, స్కాన్‌/పే అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరికైనా నగదు పంపాలనుకుంటే వారి ఫోన్‌ నంబర్, నగదు మొత్తాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఎం–పిన్‌ ఇవ్వడం ఆలస్యం లావాదేవీ జరుగుతుంది. ఖాతాకు యూపీఐ యాక్టివేషన్‌ అయి ఉండకపోతే డెబిట్‌ కార్డు వివరాలను ఇవ్వడం ద్వారా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. యూపీఐ యాప్‌లో వర్చువల్‌ ఐడీ క్రియేట్‌ చేసుకుంటే అది ఇందులోనూ ఉపయోగపడుతుంది. చెల్లింపుదారుడికి యూపీఐ సదుపాయం లేకపోతే యాప్‌లో సెండ్‌ మనీ ఆప్షన్‌ పై భాగంలో మూడు డాట్లను ట్యాప్‌ చేస్తే అకౌంట్‌+ఐఎఫ్‌ఎస్‌సీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా నగదు పంపుకోవచ్చు. ప్రస్తుతానికైతే భీమ్‌ యాప్‌ ద్వారా చేసే లావాదేవీలపై చార్జీల్లేవు. అయితే, యూపీఐ, ఐఎంపీఎస్‌ లావాదేవీలపై బ్యాంకులు స్వల్ప చార్జీలు విధించొచ్చు.

ప్రతికూలతలు
ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఒక మొబైల్‌ నంబర్‌పై ఒక్క ఖాతా అనుసంధానానికే వీలుంది. ఒకవేళ మీ నంబర్‌ రెండు ఖాతాలకు అనుసంధానమై ఉంటే ఒకదాన్ని యాప్‌లో డిసేబుల్‌ చేసుకోవాలి. రోజులో రూ.20వేల వరకే గరిష్టంగా నగదు బదిలీకి వీలుంది. ఒక లావాదేవీ విలువ గరిష్ట పరిమితి రూ.10వేలు మాత్రమే.

ఏది అనుకూలం...?
స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారికి యూపీఐ యాప్‌ ద్వారా నగదు బదిలీ చాలా సులభం. రోజులో, సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా లావాదేవీ చేసుకోవచ్చు. దుకాణాల్లోనూ చెల్లింపులను నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లించొచ్చు. డెబిట్‌ కార్డులు అవసరం లేదు. చెల్లింపులకే మాత్రమే అనుకుంటే భీమ్‌ అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార సంస్థలైతే పెద్ద మొత్తాల్లో నగదు బదిలీలకు ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ విధానాలు అనుకూలం.  
 

మరిన్ని వార్తలు