లాభాల్లో ‘హీరో’..

9 Aug, 2016 01:01 IST|Sakshi
లాభాల్లో ‘హీరో’..

రికార్డ్ స్థాయిలో లాభం, అమ్మకాలు
8 శాతం పెరిగిన అమ్మకాలు
ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయికి షేర్
ఏడాదిలో 15-20 శాతం పెరగవచ్చంటున్న విశ్లేషకులు

న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రికార్డ్ స్థాయిలో రూ.883 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు జోరుగా ఉండడంతో కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని సాధించామని హీరో మోటొకార్ప్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వచ్చిన నికర లాభం రూ.748 కోట్లుతో పోలిస్తే 18 శాతం వృద్ధి సాధించామని కంపెనీ ఎండీ, సీఈఓ పవన్ ముంజాల్ పేర్కొన్నారు. గత క్యూ1లో రూ.7,336 కోట్లుగా ఉన్న మొత్తం అమ్మకాలు 8 శాతం వృద్ధితో రూ.7,901 కోట్లకు పెరిగాయని వివరించారు. గత క్యూ1లో 16,45,867 టూవీలర్లను విక్రయించగా, ఈ క్యూ-1లో 17,45,389 టూవీలర్లను విక్రయించామని, అత్యధిక వాహనాలను అమ్మిన తొలి త్రైమాసికం కూడా ఇదేనని పేర్కొన్నారు. అమ్మకాల వృద్ధి ఆర్థిక ఫలితాల్లో ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ఇదే జోరుతో పండుగల సీజన్‌కు సిద్ధమవుతామన్నారు.

 ఏడాది గరిష్ట స్థాయిని తాకిన షేర్
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హీరో మోటొకార్ప్ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.3,554ను తాకింది. చివరకు 0.17 శాతం లాభంతో రూ.3,440 వద్ద ముగిసింది. ఏడాదిలో  15-20 శాతం పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు