జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ బిడ్డింగ్‌లో పాల్గొనద్దు

10 Aug, 2018 01:35 IST|Sakshi

జేపీ ప్రమోటర్లపై సుప్రీం నిషేధం

తాజా దివాలా ప్రక్రియకు ఆదేశాలు  

న్యూఢిల్లీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించి జేపీ గ్రూప్‌కు అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌పై  (జేఐఎల్‌) తాజాగా దివాలా ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అయితే ఈ బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనవద్దని జేఐఎల్‌తోపాటు మాతృసంస్థ జేపీ గ్రూప్‌కు, ప్రమోటర్లకు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దివాలా చట్టం (ఐబీసీ) కింద జేఐఎల్‌ హోల్డింగ్‌ కంపెనీ జేపీ అసోసియేట్స్‌ లిమిటెడ్‌పై (జేఏఎల్‌) సైతం కార్పొరేట్‌ దివాలా పరిష్కార పక్రియ ప్రారంభించేలా బ్యాంకర్లకు తగిన ఆదేశాలివ్వవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (ఆర్‌బీఐ) సుప్రీం సూచించింది.

‘‘21,532 మంది గృహ కొనుగోలుదారుల విషయంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయటానికి అటు జేఏఎల్‌ ఇటు జీఐఎల్‌కు తగిన ఆర్థిక వనరులు లేవన్న విషయం స్పష్టమైపోయింది’’ అని ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది. రూ.526 కోట్ల చెల్లింపుల్లో జేఐఎల్‌ విఫలమయ్యిందని పేర్కొంటూ, ఎన్‌సీఎల్‌టీ ముందు ఐడీబీఐ బ్యాంక్‌ కార్పొరేట్‌ దివాలా ప్రక్రియ పిటిషన్‌ దాఖలు చేసింది. తొలి రౌండ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియలో జేఐఎల్‌ లిక్విడేషన్‌ విలువకన్నా తక్కువగా ఉన్న  దాదాపు రూ.7,350 కోట్ల బిడ్‌ ఫ్రంట్‌ రన్నర్‌గా నిలిచింది. సుప్రీం తాజా రూలింగ్‌ ప్రకారం– ఇప్పటి నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమై 180 రోజుల్లో ముగియాల్సి ఉంటుంది. రుణ దాతల కమిటీలో గృహ కొనుగోలుదారులు కూడా ఉంటారు. కొత్త బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. జేఏఎల్, జేఐఎల్‌ సుప్రీంకోర్టులో డిపాజిట్‌ చేసిన రూ. 750 కోట్లు ఎన్‌సీఎల్‌టీకి బదలాయించడం జరుగుతుంది.  
 

మరిన్ని వార్తలు