అందుబాటు గృహాలపై   దృష్టి పెట్టండి! 

11 Jan, 2019 23:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రైవేట్‌ డెవలపర్లు ఎగువ మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణాలపై చూపించినంత శ్రద్ధ.. అందుబాటు గృహాల నిర్మాణంలో చూపించట్లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ తెలిపారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం వినియోగంలో హైదరాబాద్‌ అత్యంత వెనకబడి ఉందని.. ఈ పథకం కింద అఫడబుల్‌ గృహాల నిర్మాణంలో ముంబై నగరం బెటరని చెప్పారు. హైదరాబాద్‌లో 2 బీహెచ్‌కే గృహాల నిర్మాణాలను ప్రభుత్వమే చేస్తుందని, ప్రైవేట్‌ నిర్మాణ సంస్థలు కూడా  పేదలు, దిగువ మధ్య తరగతికి అవసరమైన అఫడబుల్‌ గృహాలను నిర్మించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌) సమావేశంలో ముఖ్య అతిథిగా కిశోర్‌ పాల్గొన్నారు.  

గ్రీన్‌ సిటీగా మాదాపూర్‌.. 
చైనా, సౌత్‌  కొరియా వంటి దేశాల్లో లాగా హైదరాబాద్‌ నిర్మాణ రంగంలోనూ టెక్నాలజీని వినియోగించాలి. దీంతో నిర్మాణ రంగంలో వేగంతో పాటూ అంతర్జాతీయ డిజైన్లు, నాణ్యత బాగుంటుంది. గ్రీన్‌ టెక్నాలజీ వినియోగంలో డెవలపర్లు ఆసక్తి చూపించాలి. వచ్చే ఏడాది నుంచి నగరంలోని ప్రతి భవనం గ్రీన్‌ ఎనర్జీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని.. మాదాపూర్, హైటెక్‌ సిటీలను గ్రీన్‌ సిటీలుగా మార్చాలి.  

ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు.. 
వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో రహదారులు, మంచి నీటి వంటి మౌలిక వసతుల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కేశపురం, దేవుల నాగారం ప్రాంతాల్లో రెండు రిజర్వాయర్లను నిర్మించనున్నాం. వీటి సామర్థ్యం 20 టీఎంసీలు. ఇప్పటికే 29 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 49 టీఎంసీల నీటితో భవిష్యత్తులో నగరానికి నీటి కొరతే ఉండదని ధీమావ్యక్తం చేశారు. నగరంలో మెట్రో రైల్‌తో పాటు మరొక ట్రాఫిక్‌ సొల్యూషన్‌ అవసరముందని తెలిపారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నివేదక ప్రకారం.. వరల్డ్‌ డైనమిక్‌ నగరాల జాబితాలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరును కిందికి నెట్టేసి మొదటి స్థానంలో నిలవటం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగానే నగరంలో వనరులు, పాలసీలు, విధానాలు, నాయకత్వం అన్ని అంశాలూ ఉన్నాయని తెలిపారు.

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో.. 
వచ్చే నెల ఫిబ్రవరి 15–17 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ 7వ ప్రాపర్టీ షో జరగనుంది. జంట నగరాల్లోని సుమారు వందకు పైగా నిర్మాణ సంస్థలు షోలో పాల్గొంటున్నాయని.. రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ప్రాపర్టీల వరకూ ప్రదర్శనలో ఉంటాయని క్రెడాయ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ రాంరెడ్డి తెలిపారు. మూడు రోజుల ఈ ప్రాపర్టీ షోకు సుమారు 70 వేల మంది నగరంతో పాటూ ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తారని అంచనా. 

20 శాతం ధరల వృద్ధి.. 
గత ఏడాది కాలంలో స్థిరాస్తి ధరలు 15–20 శాతం వరకు పెరిగాయని.. వచ్చే ఏడాది కాలంలో కూడా మరో 20 శాతం వరకూ ధరలు పెరుగుతాయని రాంరెడ్డి అంచనా వేశారు. రియల్టీ ధరలు, పన్నులు, ఫీజులు, స్థల ధరలు పెరిగినంత స్థాయిలో కొనుగోలుదారుల ఆదాయం మాత్రం పెరగట్లేదని అందుకే ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన, చివరి అవకాశమని సూచించారు.

మరిన్ని వార్తలు