పండుగల వేళ.. ఆఫర్లే ఆఫర్లు!

28 Sep, 2014 01:44 IST|Sakshi
పండుగల వేళ.. ఆఫర్లే ఆఫర్లు!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ కంపెనీలు పండుగల సీజన్ అమ్మకాలకు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లను ఊరించే ఆఫర్లతో ప్రచారం ప్రారంభించాయి. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, బహుమతులతో అమ్మకాలు పెంచుకునేందుకు హడా వుడి చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్ అమ్మకాల్లో 20-50 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నాయి. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల పరిశ్రమ తిరిగి పుంజుకుంటుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి.
 
ఒకదాని వెంట మరొకటి..

దసరా, దీపావళి సమీపిస్తుండడంతో కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని రకాల రిఫ్రిజిరేటర్లపై ట్యాబ్లెట్ పీసీని బహుమతిగా శాంసంగ్ అందిస్తోంది. బ్రేవియా టీవీలు, ఆల్ఫా కెమెరాలపై ప్రమోషనల్ ఆఫర్లను సోనీ ప్రకటించింది. ఖచ్చితమైన బహుమతులూ అందిస్తోంది. ఎంపిక చేసిన హై ఎండ్ టీవీలపై రూ.1.5 లక్షల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌తోపాటు సౌండ్ బార్, డీవీడీ ప్లేయర్, కొన్ని స్మార్ట్ టీవీ మోడళ్లపై మేజిక్ మోషన్ రిమోట్‌ను ఎల్‌జీ ఉచితంగా ఇస్తోంది. మైక్రోవేవ్ ఓవెన్, బ్లూరే వంటి బహుమతులను ప్యానాసోనిక్ హామీగా ఇస్తోంది. కొన్ని టీవీ మోడళ్లపై సౌండ్‌బార్, స్పీకర్ సిస్టమ్స్ ఉచితమని సాన్‌సూయ్ ప్రకటించింది.

ఇండక్షన్ కుక్‌టాప్‌తోపాటు ఖచ్చితమైన బహుమతులను కెల్వినేటర్ అందిస్తోంది. ఎంపిక చేసిన ఉపకరణాలపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. ప్రతి పీసీపైన రూ.8 వేల విలువగల బహుమతులను అందుకోండని డెల్ అంటోంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి నూతన వాషింగ్ మెషీన్ వేరియంట్‌ను వర్ల్‌పూల్ మార్కెట్లోకి తెస్తోంది. హై ఎండ్ మైక్రోవేవ్స్ కూడా రానున్నాయి. కొత్త కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతున్నట్టు హాయర్ తెలిపింది. వీడియోకాన్ నూతన 4కే యూహెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ఇ-జోన్, ఆదీశ్వర్, టీఎంసీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్, యెస్‌మార్ట్, క్రోమా తదితర మల్టీబ్రాండ్ రిటైల్ చైన్లు ఆకర్షణీయ బహుమతులతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి.  
 
గతేడాది కంటే..
ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ పుంజుకుం టున్న సంకేతాలు ఉన్నాయని హాయర్ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు నమోదు చేయడం, మార్కెట్ సెంటిమెంటు తిరిగి నిలదొక్కుకోవడం ప్రస్తుతం కలిసి వచ్చే అంశమని అన్నారు. ఎంత కాదన్నా 25 శాతంపైగా వృద్ధి కనబరుస్తుందన్న అంచనాలతో పరిశ్రమ ఉత్సాహంగా ఉందని చెప్పారు. హాయర్ ఈ సీజన్‌లో 40-50 శాతం వృద్ధి ఆశిస్తోందని పేర్కొన్నారు. ఎల్‌ఈడీ ప్యానెళ్లకు మంచి గిరాకీ ఉంటుందని ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జీఎల్ మిర్‌చందానీ వెల్లడించారు. ఈ సీజన్‌లో ఒనిడా 30 శాతం వృద్ధి ఆశిస్తోందని చెప్పారు. కాగా, ప్రజల జీవన వ్యయం పెరగడం, ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, వడ్డీ రేట్లు కిందకు రాకపోవడం వంటి అంశాలు పరిశ్రమకు మింగుడు పడడం లేదు.
 
పెద్ద పెద్ద లక్ష్యాలతో..
గతేడాది ఆగస్టు-నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో కంపెనీ అమ్మకాల విలువ 25 శాతం వృద్ధితో రూ.5,100 కోట్లు నమోదవుతుందని సోనీ అంచనా వేస్తోంది. మార్కెటింగ్ వ్యయాల కోసం కంపెనీ రూ.250 కోట్లను కేటాయించింది. సెంటిమెంటు బలంగా ఉన్న కారణంగా తమ అమ్మకాల్లో 35 శాతం వృద్ధి ఉండొచ్చని ఎల్‌జీ అంటోంది. కొత్త ప్రభుత్వం రాక, డాలరుతో పోలిస్తే రూపాయి బలంగా ఉండడంతో కస్టమర్లలో సానుకూల స్పందన కనపడుతోంది.

ఈ అంశాలే అమ్మకాలకు జోష్‌నిస్తాయని ప్యానాసోనిక్ చెబుతోంది. 2013తో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం వృద్ధిని కంపెనీ అంచనా వేస్తోంది. 2009, 2010లో పరిశ్రమ 30-40 శాతం వృద్ధి చెందింది. ఆ స్థాయిలో ప్రస్తుత సంవత్సరంలో అమ్మకాలు నమోదు కాకపోవచ్చని వర్ల్‌పూల్ ఇండియా తెలిపింది. ఈ సీజన్‌లో తమ అమ్మకాల పరిమాణంలో 20 శాతం హెచ్చుదలను వర్ల్‌పూల్ ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విపణి పరిమాణం రూ.40 వేల కోట్లుంది.

మరిన్ని వార్తలు