కానిస్టేబుళ్ల బదిలీలకు రంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

కానిస్టేబుళ్ల బదిలీలకు రంగం సిద్ధం

Published Sun, Sep 28 2014 1:48 AM

కానిస్టేబుళ్ల బదిలీలకు రంగం సిద్ధం - Sakshi

గుంటూరుక్రైం
 ఏళ్ల తరబడి ఒకే పోలీస్‌స్టేషన్‌లో, లేదా ఒకే సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న వారిని త్వరలో బదిలీ చేయడంపై రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లలో సుమారు 1500 మందికి పైగా కానిస్టేబుళ్లున్నారు. వీరిలో మూడు నుంచి ఎనిమిదేళ్లకు పైగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో, ఒకే సర్కిల్లో ఉన్న స్టేషన్‌లలో పనిచే స్తున్నారు. ఏళ్ల తరబడి అక్కడే తిష్టవేసుకుని ఉండటంతో ఆయా స్టేషన్‌ల పరిధిలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఏస్పీ జె.సత్యనారాయణ కొందరు కానిస్టేబుళ్లను బదిలీ చేసేందుకు యత్నించారు. అయితే రాజకీయ నాయకుల సిఫార్సుల కారణంగా చూసీ చూడనట్లు వ్యవహరించాల్సి వచ్చింది.
 ఎస్‌ఐ, సీఐలపైనా ఆ సిబ్బంది ప్రభావం
 ఈ ఏడాది జూలైలో ఎస్పీగా విధుల్లో చేరిన రామకృష్ణ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే వారి పనితీరుపై దృష్టి సారించారు. ఏళ్ల తరబడి స్టేషన్‌లలో పాతుకుపోయిన సిబ్బంది కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. వీరి ప్రభావం ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులపైనా పడుతోందని గ్రహించారు. శాఖాపరమైన నిబంధనల మేరకు మూడేళ్లు నిండిన కానిస్టేబుళ్లను బదిలీ చేయాల్సి ఉంది. దీంతో ఆయా కానిస్టేబుళ్ల పనితీరు, ఎక్కడ ఎవరు ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారనే అంశాలపై తన కార్యాలయ ఉద్యోగుల ద్వారా వివరాలు సేకరించి పరిశీలించి, బదిలీలకు శ్రీకారం చుట్టారు.
 మరో సబ్ డివిజన్‌కు..
 ఎస్పీ ఆదేశాల మేరకు కార్యాలయ ఉద్యోగులు మూడేళ్లుగా ఒకే సర్కిల్, పోలీస్‌స్టేషన్‌లలో పనిచేస్తున్న వారి జాబితాలను సబ్ డివిజన్‌లవారీగా రూపొందించారు. సుమారు 500 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరు పనిచేస్తున్న సబ్ డివిజన్ పరిధిలో కాకుండా మరో సబ్ డివిజన్‌కు బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
 జాబితాను ఎస్పీ పరిశీలించడమే
 ఆలస్యం.:
 బదిలీలు చేసినా సిబ్బంది కొరత లేకుండా ఉండేలా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జాబితాను ఎస్పీ పరిశీలించాక ఆయా సిబ్బందిని పిలిపించి మూడు ఆప్షన్‌ల విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేసేలా ఎస్పీ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.
 సిబ్బందిలో ఆందోళన
 అర్బన్, రూరల్ జిల్లాల సిబ్బంది విభజన జరిగే వరకూ తమకు బదిలీలుండవని భావించిన సిబ్బందిలో ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 87 మంది ఏఎస్‌ఐలు, 126  మంది హెడ్ కానిస్టేబుళ్లను ఎస్పీ కౌన్సిలింగ్ విధానంలో బదిలీ చేశారు. మళ్లీ బదిలీల ప్రక్రియను కానిస్టేబుళ్లకు ప్రారంభించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే కుటుంబపరంగా, విధుల పరంగా సమస్యలు ఎదుర్కోక తప్పదని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం వేల రూపాయల ఫీజులు చెల్లించామని, ఇప్పుడు బదిలీచేస్తే ఎలాగని మదనపడుతున్నారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలనా సౌలభ్యం కోసం విద్యాసంవత్సరం మధ్యలోనైనా 30 శాతం బదిలీలు చేసే అవకాశం ఉండటంతో కానిస్టేబుళ్లు దీనిపై నోరు మెదిపేందుకు సాహసించడం లేదు.



 

Advertisement
Advertisement