ఇక థాయ్ వీసా గడువు 6 నెలలు

23 Sep, 2015 02:12 IST|Sakshi
ఇక థాయ్ వీసా గడువు 6 నెలలు

ఆలోగా ఎన్నిసార్లయినా వెళ్లి రావచ్చు...
- నవంబర్ 13 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
- థాయ్‌లాండ్ కాన్సుల్ జనరల్ సోమ్‌సాక్ త్రియంజంగరుణ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
వ్యాపారవేత్తలకు, పర్యాటకులకు థాయ్‌లాండ్ ఎర్రతివాచీ పరిచింది. గతంలో 90 రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆ దేశానికి వెళ్లొచ్చే అవకాశముండేది. కానీ, కొత్త వీసా నిబంధనలతో ఒకసారి వీసా తీసుకుంటే 6 నెలల్లో వ్యాపారులు, పర్యాటకులు థాయ్‌కు ఎన్నిసార్లయినా వెళ్లొచ్చే అవకాశం రానుంది. నవంబర్ 13 నుంచి ఈ కొత్త వీసా నిబంధన అమలులోకి రానున్నట్లు థాయ్‌లాండ్ కాన్సుల్ జనరల్ సోమ్‌సాక్ త్రియంజంగరుణ్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ‘థాయ్‌లాండ్ ఆర్థికాభివృద్ధి- వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై మంగళవారమిక్కడ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమ్‌సాక్ మాట్లాడుతూ.. ‘‘కొత్త వీసా జారీకి 5,000 థాయ్ భట్స్ (థాయ్‌లాండ్ కరెన్సీ.

మన కరెన్సీలో సుమారు 10వేలు) ఖర్చవుతాయి. వీసా జారీని మరింత వేగవంతం చేసేందుకు బంజారాహిల్స్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించాం. దరఖాస్తు చేసుకున్న 3-4 రోజుల వ్యవధిలో వ్యాపారులు, పర్యాటకులకు వీసా, పాస్‌పోర్ట్‌ను అందిస్తాం’’ అని చెప్పారు. ఏటా థాయ్‌లాండ్‌కు విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని... ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 70 లక్షల మంది పర్యాటకులు థాయ్‌ను సందర్శించారని పేర్కొన్నారు. టూరిజానికే కాకుండా థాయ్‌లో వ్యాపారావకాశాలూ పుష్కలంగా ఉన్నాయని.. వాహన పరికరాలు, కూరగాయలు, విలువైన రాళ్లు, జ్యుయలరీ రంగాలకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలియజేశారు. 2014లో ఇండియా, థాయ్ మధ్య 8 బిలియన్ డాలర ్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని.. ఈ ఏడాది అది 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని సోమ్‌సాక్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్యూ2లో థాయ్‌లాండ్ నుంచి ప్రపంచ దేశాలకు 52.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా.. ఇతర దేశాల నుంచి థాయ్‌కు 44.8 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయని తెలిపారు.

మరిన్ని వార్తలు