2016–17 నోటీసులా.. సరిదిద్దుకోండి!

28 May, 2018 00:24 IST|Sakshi

అప్పుడే నెల రోజులు దాటింది. 2016–17కు సంబంధించిన రిటర్నుల విషయంలో ఆన్‌లైన్‌ నోటీసులు వస్తున్నాయి. ఇందులో ‘మీరు వేసిన రిటర్నులను మేం చూశాం. కానీ మా దగ్గరున్న మీ అకౌంట్‌ 26ఏఎస్‌లో మీ ఆదాయం మీరు చూపించిన ఆదాయం కన్నా ఎక్కువగా ఉంది. అలాగే మీరు డిక్లేర్‌ చేసిన పన్నులకు సంబంధించి కూడా వ్యత్యాసం ఉంది. మీరు దీనితో ఒప్పుకుంటున్నారా. ఒప్పుకుంటే రిటర్న్‌ రివైజ్‌ చేయండి. పన్ను కట్టండి. ఒకవేళ ఒప్పుకోకపోతే సరైన వివరణ ఇవ్వండి’ అని అంటోంది. చాలా మందికి ఇలాంటి నోటీసులొచ్చాయి.

వెంటనే చెక్‌ చేసుకొని, రికార్డులు సరిచూసుకొని సమాధానమివ్వండి. ఒకవేళ జవాబివ్వకపోతే ఆన్‌లైన్‌లోనూ, సెల్‌ఫోన్ల ద్వారా రిమైండర్లు ఇస్తున్నారు. జాప్యం వద్దు. తప్పు జరిగితే సరిదిద్దుకోండి. రివైజ్‌ చేసి పన్ను కట్టండి. ఒకవేళ డిపార్ట్‌మెంట్‌ వారితో ఏకీభవించకపోతే తగిన కాగితాలతో సమాధానమివ్వండి. ఇక్కడో ఉదాహరణ చూద్దాం...! 2016–17 ఆర్థిక సంవత్సరంలో లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ ఏర్పడ్డ శ్రీధర్‌ వెంటనే ఇల్లుకొని పన్ను భారం నుంచి బయటపడ్డాడు. కోట్ల మీద వ్యవహారం కాబట్టి రిటర్నులు వేసి ఆదాయం నిల్‌ అని చూపించాడు.

కానీ ఫారం 26ఏఎస్‌లో సుమారు రూ.50,000 వడ్డీ వచ్చినట్లు సమాచారం. ముందు అవాక్కు. తర్వాత బ్యాంక్‌ ఖాతాలో జమ కనిపించింది. వెంటనే రిటర్న్‌ రివైజ్‌ చేసి ఆ ఆదాయాన్ని చూపించాడు. అయితే ట్యాక్స్‌టుల్‌ ఇన్‌కమ్‌ పరిధి లోపలే ఉండటంతో పన్ను భారం లేదు. రిటైర్‌ అయిన రంగారావుకూ ఇలాంటి నోటీసే అందింది. వెంటనే తాను పనిచేసిన కార్యాలయాన్ని సంప్రదించారు. వారు ఈయనతో ‘మీకు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ తప్పు. రివైజ్‌ చేసిన స్టేట్‌మెంట్‌ మీకు ఇవ్వలేదు.

రివైజ్‌ స్టేట్‌మెంట్‌ ప్రకారం మేం టీడీఎస్‌ రిటర్నులు సబ్మిట్‌ చేసి అప్‌లోడ్‌ చేశాం. ఈ తప్పుని సరిదిద్ది రిటర్నులు వేయండి’ అని చెప్పారు. రంగారావు తప్పుని సరిదిద్ది ఆదాయాన్ని సరిచేసి, ఆ అదనపు ఆదాయంపై పన్ను చెల్లించారు. ఈ రోజు వరకూ వడ్డీ కూడా పడుతుంది. చెల్లించి రిటర్నులు వేశారు. డాక్టర్‌ శ్యామలదీ ఇదే పరిస్ధితి. బ్యాంక్‌ ఖాతాలో ఏరియర్స్‌ పడ్డా వాటిని పట్టించుకోకుండా కేవలం కరెంట్‌ సంవత్సరం పెన్షన్‌ చూపించారు. టీడీఎస్‌ ఎక్కువ జమకావడం వల్ల రిఫండ్‌ క్లెయిమ్‌ చేశారు.

నోటీసులు వచ్చాక బ్యాంక్‌ ఖాతాను నిశితంగా పరిశీలిస్తే విషయం బయటపడింది. వెంటనే వృత్తి నిపుణులని సంప్రదించి ఏరియర్స్‌ని పరిగణనలోకి తీసుకొని ఆదాయాన్ని లెక్కించారు. ఆదాయం పెరిగింది. రిఫండ్‌ తగ్గింది. రిటర్న్‌ వేశారు. ఈ కేసులన్నింటిలోనూ ఆదాయం పెరగడం, రివైజ్‌ చేయడం వంటి అంశాలనే చూశాం. కొన్ని కేసుల్లో ఎలా జరిగిందంటే.. యజమానులు అంటే కంపెనీలు/ ఆఫీసులు టీడీఎస్‌ రిటర్నులను అప్‌లోడ్‌ చేసేటప్పుడు తప్పులు దొర్లుతున్నాయి.

ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం నెలకు రూ.1,00,000. సంవత్సరానికి రూ.12 లక్షలు. నికర ఆదాయం మీద పన్ను రూ.1,20,000. కానీ బ్యాంక్‌ ద్వారా చెల్లించింది రూ.10,80,000. ఫారం 26ఏఎస్‌ అప్‌లోడ్‌ చేసినప్పుడు ఎంత మొత్తం క్రెడిట్‌ చేశారు అన్న ప్రశ్నకు కొంత మంది రూ.12,00,000 రాశారు. మరికొంత మంది రూ.10,80,000లని తెలిపారు.  

మరో ఉదాహరణను చేస్తే.. స్థూల జీతం రూ.12,00,000. ఇంటి అద్దె అలవెన్స్‌ రూ.1,20,000. వృత్తి పన్ను రూ.2,400. అలవెన్స్‌ రూ.17,600. ఈ మూడింటి మొత్తం రూ.1,40,000. ఈ మొత్తాన్ని నూరు శాతం మినహాయించేసి యజమాని పన్ను రికవరీ చేసి టీడీఎస్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఫారం 26ఏఎస్‌లో అప్‌లోడ్‌ చేసేటప్పుడు ట్యాక్సబుల్‌ ఇన్‌కం కాలమ్‌ ఎదురుగా రూ.10,60,000కి బదులుగా రూ.12,00,000 వేస్తున్నారు.

26ఏఎస్‌లో మినహాయింపుతో కలిపి స్థూల జీతం కనిపిస్తోంది. రిటర్న్‌లో నికర ఆదాయం తీసుకుంటున్నాం. ఈ రెండింటిని  పోలిస్తే మనం ఆదాయం తక్కువ చూపించినట్లు తెలుస్తుంది. కానీ నిజానికి ఇక్కడ అసెస్సీ తప్పు లేదు. యజమాని ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందుల్లో పడుతున్నారు. దీనివలన అదనపు పన్ను భారం ఏర్పడకపోయినా లేనిపోని టెన్షన్‌. నోటీసులు రాగానే సమాధానమివ్వండి. రికార్డులు సరిచూసుకోండి. ఆదాయాన్ని పన్నుభారాన్ని సరిదిద్దుకోండి.  

మరిన్ని వార్తలు