అక్కడ తగ్గింది.. ఇక్కడ పెరిగింది..

27 Jan, 2016 00:35 IST|Sakshi
అక్కడ తగ్గింది.. ఇక్కడ పెరిగింది..

♦ అంతర్జాతీయంగా 2.8 శాతం తగ్గిన ఉక్కు ఉత్పత్తి
♦ 2009 నుంచి ఇదే తొలి క్షీణత
♦ భారత్‌లో భిన్నమైన పరిస్థితి; 2.6 శాతం పెరుగుదల
♦ డబ్ల్యూఎస్‌ఏ నివేదిక 


లండన్: అంతర్జాతీయంగా ఉక్కు ఉత్పత్తి తగ్గితే.. భారత్‌లో మాత్రం పెరిగింది. అంతర్జాతీయంగా ఉక్కు ఉత్పత్తి గతేడాది 2.8 శాతం క్షీణతతో 1,622 మిలియన్ టన్నులకు తగ్గింది.  2009 నుంచి చూస్తే ఇదే తొలి క్షీణత. కాగా భారత్‌లో 2014లో 87.3 మిలియన్ టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి 2015కు వచ్చేసరికి 2.6 శాతం వృద్ధితో 89.6 మిలియన్ టన్నులకు పెరిగింది.

 పరిశ్రమ సమాఖ్య వరల్డ్ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) ప్రకారం.. 2008లో 1,343 మిలియన్ టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి 2009కి వచ్చేసరికి 8 శాతం తగ్గుదలతో 1,238 మిలియన్ టన్నులకు క్షీణించింది. అటుపై 2009 తర్వాతి నుంచి ఉక్కు ఉత్పత్తి 2014 వరకు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అంతర్జాతీయ ఉక్కు ఉత్పత్తి 2010లో 1,433 మిలియన్ టన్నులుగా, 2011లో 1,538 మిలియన్ టన్నులుగా, 2012లో 1,560 మిలియన్ టన్నులుగా, 2013లో 1,650 మిలియన్ టన్నులుగా, 2014లో 1,670 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది.

 గతేడాదిలో ముడి ఉక్కు ఉత్పత్తి 1,622 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది 2014తో పోలిస్తే 2.8 శాతం తక్కువ. డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం, ధరల తగ్గుదల వంటి అంశాల కారణంగా ప్రస్తుతం ఉక్కు పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఉక్కు కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకోవడం ద్వారా ధరలను స్థిరీకరించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఉత్పత్తి తగ్గిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొన్ని ఉక్కు ఉత్పత్తుల ధర గతేడాది పదేళ్ల కనిష్ట స్థాయికి పడిన సంగతి తెలిసిందే.

ఆసియా ప్రాంతంలో ముడి ఉక్కు ఉత్పత్తి 2014తో పోలిస్తే 2015లో 2.3 శాతం తగ్గి 1,113 మిలియన్ టన్నులకు క్షీణించింది. ఇదే సమయంలో ప్రపంచ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు చైనాలో కూడా ముడి ఉక్కు ఉత్పత్తి 2.3 శాతం క్షీణించి 803 మిలియన్ టన్నులకు తగ్గింది. కానీ ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో దీని వాటా మాత్రం 49.3% నుంచి 49.5 శాతానికి పెరిగింది. ఇక జపాన్‌లో ముడి ఉక్కు ఉత్పత్తి 5 శాతం తగ్గుదలతో 105 మిలియన్ టన్నులకు పడింది. అమెరికాలో ముడి ఉక్కు ఉత్పత్తి 10 శాతం క్షీణతతో 78.9 మిలియన్ టన్నులకు తగ్గింది.

మరిన్ని వార్తలు