ప్రైవేట్‌ పెట్టుబడులకు తోడ్పాటునివ్వాలి

16 Feb, 2019 00:15 IST|Sakshi

కోటక్‌ బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌

ముంబై: వృద్ధి రేటును మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటే ప్రైవేట్‌ పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విధానపరమైన చర్యలు లేదా పన్నుపరమైన ప్రయోజనాలను పరిశీలించవచ్చని ఆయన చెప్పారు. తద్వారా 7 శాతం వృద్ధి దగ్గరే చిక్కుబడిపోకుండా మరింత మెరుగ్గా రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో వృద్ధి అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ 7.2–7.4 శాతానికి పరిమితం చేసిన నేపథ్యంలో కోటక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.1 శాతం మాతమ్రే నమోదైంది. మరోవైపు, వ్యవస్థలో ద్రవ్యకొరత కారణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయిన నేపథ్యంలో ద్రవ్య లభ్యత మెరుగుపర్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉదయ్‌ కోటక్‌ చెప్పారు. ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయని.. అయితే ఈ సమస్య వ్యవస్థాగతమైనది కాదని, ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురికావడమే దీనికి కారణమని విశ్లేషించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సమస్య పరిష్కారానికి ఉదయ్‌ కోటక్‌ సారథ్యంలో ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. 

మరిన్ని వార్తలు