అమెరికాలో కేసు.. కోర్టు బయట పరిష్కారం

19 Dec, 2019 00:58 IST|Sakshi

రూ. 5.6 కోట్లు చెల్లించనున్న ఇన్ఫోసిస్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికాలో విదేశీ ఉద్యోగులను తప్పుగా వర్గీకరించి చూపడం, పన్నుపరమైన మోసాలకు పాల్పడటం తదితర ఆరోపణలకు సంబంధించిన కేసును ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కోర్టు వెలుపల పరిష్కరించుకోనుంది. ఇందుకు సంబంధించి కాలిఫోర్నియా రాష్ట్రానికి 8,00,000 డాలర్లు (సుమారు రూ.5.6 కోట్లు) చెల్లించనుంది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ జేవియర్‌ బెసెరా ఈ విషయాలు తెలిపారు. ‘తక్కువ జీతాలతో పనిచేయించుకునేందుకు, పన్నులు ఎగ్గొట్టేందుకు ఇన్ఫోసిస్‌ తప్పుడు వీసాలపై ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చింది. కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవనడానికి ఈ సెటిల్మెంట్‌ ఒక నిదర్శనం’ అని పేర్కొన్నారు.

2006–2017 మధ్య కాలంలో అమెరికాలో 500 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్‌ హెచ్‌–1బీ వీసాలపై కాకుండా బీ–1 వీసాలపై పనిచేయించుకుందన్న ప్రజా వేగు ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఇలాంటి తప్పుడు వర్గీకరణ వల్ల ఇన్ఫోసిస్‌.. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరుద్యోగ బీమా, వైకల్య బీమా, ఉద్యోగుల శిక్షణ పన్నులు చెల్లించకుండా తప్పించుకుందని ఆరోపణలున్నాయి. సాధారణంగా హెచ్‌–1బీ వీసాలపై పనిచేసే సిబ్బందికి స్థానిక నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, తమపై ఆరోపణలను ఇన్ఫోసిస్‌ తోసిపుచ్చింది. సుదీర్ఘంగా 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి  ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే పరిష్కరించుకుంటున్నట్లు వివరణనిచ్చింది. తప్పుడు పత్రాలు సమర్పించిందన్న ఆరోపణలను సెటిల్‌ చేసుకునేందుకు 2017లో న్యూయార్క్‌కు ఇన్ఫోసిస్‌ 1 మిలియన్‌ డాలర్లు చెల్లించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా