రిలయన్స్ జియోలో ఇంటెల్‌- జియోమీట్‌ యాప్‌

3 Jul, 2020 08:51 IST|Sakshi

0.39 శాతం వాటా కొనుగోలు

రూ. 1895 కోట్ల పెట్టుబడి

మొత్తం 25.1 శాతం వాటా విక్రయం

రూ. 1.17 లక్షల కోట్లు సమీకరించిన రిలయన్స్ జియో

వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌- జియోమీట్‌ విడుదల

100 మంది పార్టిసిపేషన్‌కు వీలు

పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ జియోలో మరో విదేశీ దిగ్గజం ఇన్వెస్ట్‌ చేస్తోంది. గ్లోబల్‌ సెమీకండక్టర్‌ దిగ్గజం ఇంటెల్‌ కార్ప్‌.. రిలయన్స్‌ జియోలో 0.39 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్‌, టెలికం విభాగమైన రిలయన్స్‌ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటిపకే రిలయన్స్ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 43,574 కోట్లు వెచ్చించింది.

100 మందికి వీలుగా
రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌కు వీలు కల్పించే యాప్‌ను ప్రవేశపెట్టింది. జియోమీట్‌ పేరుతో వీడియో కాలింగ్‌ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ప్లే స్టోర్‌తోపాటు యాప్‌ స్టోర్‌లోనూ జియోమీట్‌ అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ఈ యాప్‌ ద్వారా 100 మందివరకూ వీడియో కాన్ఫరెన్సింగ్‌లో పాల్గొనవచ్చని తెలియజేసింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల ద్వారా ఉచితంగా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చని వివరించింది. గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ ద్వారా వినియోగదారులు వీడియో కాన్ఫరెన్సింగ్‌కు హాజరుకావచ్చని తెలియజేసింది.

11 వారాల్లో 12 కంపెనీలు
గత 11 వారాల్లో రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మొత్తం 12 కంపెనీలు పెట్టుబడులకు క్యూ కట్టాయి. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొత్తం 25.09 వాటాను విక్రయించింది. వెరసి రూ. 1,17,588 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఇటీవల జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇతర కంపెనీలలో జనరల్ అట్లాంటిక్, సిల్వర్‌లేక్‌ పార్టనర్స్‌, విస్టా, ముబడాలా, కేకేఆర్‌, సౌదీ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ పీఐఎఫ్‌ తదితరాలు చేరాయి. 

మరిన్ని వార్తలు