మీ పీఎఫ్ డబ్బుపై వడ్డీరేటు పెరగొచ్చు!

9 Dec, 2015 12:16 IST|Sakshi
మీ పీఎఫ్ డబ్బుపై వడ్డీరేటు పెరగొచ్చు!

న్యూఢిల్లీ: 2015-16 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్- పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీరేటును ఈపీఎఫ్వో పెంచే అవకాశముంది. గత రెండేళ్లుగా పీఎఫ్ డబ్బుపై 8.75శాతం వడ్డీరేటును ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో)కు చెందిన అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశం అజెండాలో వడ్డీ రేటు పెంపు అంశం లేకపోయినా.. ఈ అంశం గురించి చర్చించి ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

ఈపీఎఫ్వోను పునర్వ్యవస్థీకరించే అంశంపై బుధవారం నాటి భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. దాంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయ అంచనాలపై కసరత్తు చేసి.. పీఎఫ్ పై వడ్డీరేటును నిర్ణయించవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో పీఎఫ్ పై 8.75 శాతం వడ్డీరేటు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి కొద్దిగానైనా వడ్డీరేటును పెంచే అవకాశముంది. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీరేటును యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఈపీఎఫ్వోను కోరుతున్నా.. వడ్డీరేటు మాత్రం పెరిగే అవకాశముందని ఆ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు