వైజాగ్ లో జపాన్ కంపెనీ హౌసింగ్ ఫ్రాజెక్ట్

6 Nov, 2014 00:44 IST|Sakshi
వైజాగ్ లో జపాన్ కంపెనీ హౌసింగ్ ఫ్రాజెక్ట్

 న్యూఢిల్లీ: దేశీ రియల్టీ మార్కెట్లోకి తొలిసారి జపాన్ కంపెనీ టమ హోమ్ అడుగుపెట్టనుంది. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన టమ హోమ్ భారత్‌లో గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు సింగపూర్ కంపెనీ డెవలపర్ గ్రూప్‌తో జతకట్టనుంది. తొలుత  వైజాగ్‌లో 50 ఎకరాల్లో ఒక టౌన్‌షిప్‌ను, లూథియానాలో 150 ఎకరాల్లో మరో టౌన్‌షిప్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది.

 4 నెలల్లో వైజాగ్ ప్రాజెక్ట్
 టమ హోమ్‌తో భాగస్వామ్యంపై డెవలపర్ గ్రూప్ సీఈవో డేవిడ్ రెబెల్లో మాట్లాడుతూ ఐదేళ్లలో రూ. 6,000 కోట్లను వెచ్చించడం ద్వారా 12-18 ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగు నెలల్లో వైజాగ్, లూథియానాలలో టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆపై 2015 ద్వితీయార్థంలో చెన్నైలోనూ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు.

 తొలి దశలో హౌసింగ్ విభాగంపైనే దృష్టిపెడతామని, తదుపరి దశలో ఇతర విభాగాలలోకి ప్రవేశిస్తామని తెలిపారు. ఇండియాలో హౌసింగ్‌కు భారీ అవకాశాలున్నాయని టమ హోమ్ ప్రెసిడెంట్ యషుహిరో టమకి ఈ సందర్భంగా చెప్పారు.  భారత రియల్టీ మార్కెట్లో భూకంపాన్ని తట్టుకునే సాంకేతికతను తీసుకురానున్నట్లు చెప్పారు. ఇండియాలో ప్రవేశించేందుకు ఏడాది క్రితమే ప్రణాళికలు వే సినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తరువాత ఇవి ఊపందుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు