సంపద కోల్పోవడంలోనూ ప్రపంచ కుబేరుడి రికార్డు

31 Oct, 2018 09:25 IST|Sakshi
అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌(ఫైల్‌ ఫొటో)

ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీగా పతనమవడంతో ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ భారీగా సంపద కోల్పోయారు. గడిచిన రెండు రోజులుగా ఆయన 19.2 బిలియన్‌ డాలర్లు(సుమారు 1.40 లక్షల కోట్ల రూపాయలు) నష్టపోయారని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ 16.5 బిలియన్ డాలర్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  సంపద కోల్పోవడంలోనూ జెఫ్‌ బెజోస్‌ కొత్త రికార్డు సృష్టించారని నివేదిక పేర్కొంది.

సోమవారం నాడు అమెరికా మార్కెట్‌ సూచీ భారీగా కుదుపులకు లోనవడంతో అమెజాన్‌ షేర్లు 6.3 శాతం మేర పడిపోయాయి. కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ ఆర్థిక సంస్థ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచంలోని 500 మంది టాప్‌ బిలియనీర్లు భారీగా సంపద కోల్పోతున్నారని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్‌లో జెఫ్‌ బెజోస్‌ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. మెక్సికన్‌ టెలికాం టైకూన్‌ కార్లస్‌ స్లిమ్‌ 2.5 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయి రెండో స్థానాన్ని ఆక్రమించారు.

మరిన్ని వార్తలు