జెట్‌ మాజీ ఛైర్మన్‌ గోయల్‌కు మరోసారి చిక్కులు

21 Sep, 2019 18:58 IST|Sakshi

సాక్షి, ముంబై:   జెట్‌ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకులు నరేష్‌ గోయల్‌కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. నిధుల మళ్లింపు ఆరోపణలతో  ఇండిపెండెంట్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భావిస్తోంది. ఎస్‌బిఐ నిర్వహించిన ఆడిట్‌పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్‌నిర్వహిస్తామని ప్రకటించడంతో నరేష్‌గోయల్‌  చిక్కుల్లోపడ్డారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్‌గోయల్‌కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు సీనియర్‌ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ , నిర్వహణ ఖర్చులు ముసుగులో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది.

నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించడమే మంచిని భావిస్తోంది. గతవారంలో గోయల్‌ను ప్రశ్నించిన అధికారులు ఎస్‌బిఐ నిర్వహించిన ఆడిట్‌లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్‌తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది. ముంబై కార్యాలయంలో గత వారంలోనే గోయల్‌ను విచారించిన ఈడీ విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణ నిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత మొదటిసారి ముంబైలో గోయల్‌ను ప్రశ్నించింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్‌ తిరస్కరించారు. కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్లైన్స్ చైర్మన్  గోయల్‌ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు. అలాగా మార్చిలో జెట్ ఎయిర్‌వేస్ బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా  గోయల్,  అతని భార్య అనిత రాజీనామా చేశారు. ఈ సంక్షోభం  నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు