ప్రభుత్వానికి మరో దెబ్బ : జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా..

10 Apr, 2018 13:52 IST|Sakshi

ముంబై : కేంద్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను కొనుగోలు చేసే రేసు నుంచి ఇండిగో తప్పుకున్న అనంతరం, తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా తాము ఈ కొనుగోలు ప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ఎయిరిండియా కొనుగోలు కోసం తాము బిడ్‌ దాఖలు చేయడం లేదని జెట్‌ ఎయిర్‌వేస్‌ మంగళవారం స్పష్టం చేసింది. దీంతో ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు కాస్త ప్రతికూలతలే  ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. 

‘ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచనను మేము స్వాగతిస్తున్నాం. ఇది చాలా కీలక నిర్ణయం’ అని జెట్‌ ఎయిర్‌వేస్‌ డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమిత్‌ అగర్వాల్‌ అన్నారు. ఇన్‌ఫర్మేషన్‌ మెమోరాండంలో ఆఫర్‌ చేసే నిబంధలను పరిశీలించిన తాము, ఈ ప్రక్రియలో పాల్గొనకూడదని నిర్ణయించామని చెప్పారు. 

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఎయిర్‌లైన్‌ మార్కెట్‌లో ఎయిరిండియా మెల్లమెల్లగా తన మార్కెట్‌ షేరును కోల్పోయిన సంగతి తెలిసిందే. తక్కువ ధర గల ప్రైవేట్‌ ప్లేయర్స్‌కు ఎయిరిండియా తన మార్కెట్‌ షేరును వదులుకుంది. దీంతో ఎయిరిండియా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్‌కు రూ.52వేల కోట్ల మేర అప్పులున్నాయి. ప్రభుత్వం ఇటీవలే  ఈ క్యారియర్‌లో ఉన్న 76 శాతం వాటాలను విక్రయించనున్నట్టు ప్రకటించింది. 

ఎయిరిండియాను కొనుగోలు చేయాలని ప్లాన్‌ నుంచి తప్పుకున్న ఇండిగో దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థ. కానీ ఈ సంస్థ ఎయిరిండియా అంతర్జాతీయ రూట్లపై ఆసక్తి చూపించినప్పటికీ, దేశీయ కార్యకలాపాలపై తమకెలాంటి ఆసక్తి లేదని ప్రకటించేసింది. దీంతో తాము ఎయిరిండియా కొనుగోలు రేసు నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ఇదే మాదిరి తాము ఎయిరిండియా కొనుగోలు చేసేందుకు బిడ్‌ దాఖలు చేయబోమని ప్రకటించింది. 
 

>
మరిన్ని వార్తలు