కేసీపీ గ్రూపు అధినేత వీఎల్‌ దత్‌ కన్నుమూత

19 Feb, 2020 07:57 IST|Sakshi

కొరుక్కుపేట (చెన్నై, సాక్షి): తెలుగు వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ వీఎల్‌ దత్‌ (82) గుండె పోటు కారణంగా మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాదత్, కుమార్తె కవితా దత్‌ ఉన్నారు. 1937 డిసెంబర్‌ 27న జన్మించిన వెలగపూడి లక్ష్మణదత్‌ (వీఎల్‌దత్‌) లండన్‌లోని బిజినెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. కేసీపీ గ్రూపు సిమెంట్, చక్కెర తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘డాక్టర్‌ వీఎల్‌ దత్‌ అకాల మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము. పరిశ్రమలకు, దేశానికి ఆయన అందించిన సేవలను ఫిక్కీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీఎల్‌ దత్‌ 1991–92 వరకు ఫిక్కీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

సీఎం జగన్‌ సంతాపం
వీఎల్‌ దత్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దత్‌ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.

మరిన్ని వార్తలు