ప్రతీ ఆరు నెలలకో కొత్త మోడల్‌

5 Dec, 2018 02:24 IST|Sakshi

జూన్‌ నుంచి కియా మోటార్స్‌ వాహనాలు

ఎస్‌పీ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీతో అరంగేట్రం

‘కియా’ ఇండియా సీఈఓ, ఎండీ షిమ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజ కంపెనీ కియా మోటార్స్‌ వచ్చే ఏడాది జూన్‌ నుంచి భారత్‌లో వాహనాలను విక్రయించనుంది. ప్రతి ఆరు నెలలకూ ఒక కొత్త మోడల్‌ చొప్పున మూడేళ్లలో ఆరు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తెస్తామని కియా మోటార్స్‌ ఇండియా సీఈఓ, ఎండీ కుక్‌యున్‌ షిమ్‌ తెలిపారు. అమ్మకాలు అధికంగా ఉండే కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్‌కు ప్రస్తుతం పెద్దగా ప్రాధాన్యమివ్వటం లేదన్నారు. మూడేళ్లలో అగ్రశ్రేణి అయిదు కంపెనీల్లో ఒకటిగా నిలవడం లక్ష్యమని చెప్పారు. ‘‘మాస్‌ సెగ్మెంట్లో ప్రీమియమ్‌ బ్రాండ్‌గా నిలవాలనుకుంటున్నాం. ప్రస్తుతం మేం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో వాహనాలను విక్రయిస్తున్నాం. అపారమైన అనుభవం ఉంది. భారత్‌లో కాంపాక్ట్‌ కార్లు లేకుండా టాప్‌–5 కంపెనీల్లో ఒకటిగా నిలవటమనేది దాదాపు అసాధ్యం. కానీ మా అనుభవం ఆధారంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అమ్మకాల తోడ్పాటు కోసం, అవసరమైనప్పుడు, కాంపాక్ట్‌ కార్లను కూడా రంగంలోకి దింపుతాం’’ అని షిమ్‌ తెలియజేశారు.  

ఎస్‌సీ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీతో ఆరంభం.... 
ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఎస్‌యూవీ, ఎస్‌పీ కాన్సెప్ట్‌తో భారత్‌లో అమ్మకాలు ఆరంభిస్తామని షిమ్‌ తెలిపారు. భారత వినయోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును తయారు చేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ కారు చక్కని అమ్మకాలు సాధిస్తుందన్న ధీమా ఉంది. భవిష్యత్తులో కూడా వినియోగదారుల అభిరుచులు, అవసరాలకనుగుణంగానే వాహనాలను అందిస్తాం. భారత వాహన మార్కెట్‌ చాలా భిన్నమైనది. ప్రతి సెగ్మెంట్‌లోనూ విభిన్న రకాలైన వాహనాలు అవసరం’’ అని చెప్పారాయన. కియా మోటార్స్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్‌ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం మూడు లక్షలు.

ఏప్రిల్‌ నుంచి కొత్త జీఎస్‌టీ రిటర్న్‌ ఫారాలు 
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సరళంగా ఉండే కొత్త జీఎస్‌టీ ఫారాలను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను కచ్చితంగా సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పన్నులు ఎగవేస్తున్న సంస్థల వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో పాండే చెప్పారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ నెలలో మరోసారి సమావేశం కానున్నట్లు తెలియజేశారు. 

ఐటీ చట్టంలో అస్పష్టత తొలగించడంపైనే టాస్క్‌ఫోర్స్‌ దృష్టి.. 
కాగా ఆదాయ పన్ను చట్టాన్ని సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌.. నాటకీయ మార్పులు, పన్ను రేట్ల సవరణలు మొదలైన అంశాలకు సంబంధించి సిఫార్సులు చేయబోదని టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌ అఖిలేష్‌ రంజన్‌ తెలిపారు. ప్రధానంగా చట్టాల్లో అస్పష్టతను తొలగించడంపైనే దృష్టి పెడుతుందని వివరించారు.

‘యస్‌’ బ్యాంకు నుంచి రెండు ఫండ్‌లు
న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని యస్‌ బ్యాంక్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ, యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ త్వరలో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి ఆమోదం పొందినట్లు యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తెలియజేసింది. యస్‌ లిక్విడ్‌ ఫండ్, యస్‌ ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ల పేరుతో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీమ్‌లను త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రస్తుతం మన దేశంలో 40కు పైగా కంపెనీలు మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లను నిర్వహిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు