గతవారం బిజినెస్

20 Jun, 2016 02:28 IST|Sakshi

గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ శుభారంభం
స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ గత సోమవారం శుభారంభం చేసింది. ట్రేడింగ్ తొలి రోజే 7 శాతం లాభాలు వచ్చాయి. గ్రామ్ డినామినేషన్ గోల్డ్ బాండ్ రూ.2,930 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో లిస్ట్ అయింది. 7.43 శాతం లాభంతో రూ.3,147.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10.3 శాతం లాభంతో రూ.3,258 గరిష్ట స్థాయిని తాకింది. 736 లావాదేవీలు జరిగాయి. టర్నోవర్ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి రూ.23.18 లక్షలుగా నమోదైంది.
 
టాటా క్లిక్‌లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ తాజాగా టాటా గ్రూప్ ఇటీవలనే ప్రారంభించిన తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ‘టాటా క్లిక్’లో ప్రత్యేకమైన స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మైక్రోసాఫ్ట్ తన ట్యాబ్లెట్స్, సాఫ్ట్‌వేర్, ఫోన్లను వినియోగదారులకు
 విక్రయించనున్నది.
 
ప్రోంటెక్‌లో పెరిగిన హవెల్స్ వాటా
ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హవెల్స్ తన భాగ స్వామ్య కంపెనీ ప్రోంటెక్ రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో అధిక వాటాను చేజిక్కించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 51 శాతం ఉన్న వాటాను హవెల్స్ 70 శాతానికి పెంచుకున్నట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రోంటెక్ ప్రస్తుతం ఎల్‌ఈడీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ రంగంలో ఉంది.
 
ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్ పేరు మార్పు
ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్ కంపెనీ పేరు భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌గా మారింది. భారత్‌లో అతి పెద్ద సూక్ష్మరుణ సంస్థల్లో ఒకటిగా భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(గతంలో ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్) కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. 18 రాష్ట్రాల్లో లక్షకు పైగా గ్రామాల్లో 63.65 లక్షల మహిళా సభ్యుల సూక్ష్మ రుణ అవసరాలను తీరుస్తోంది. ఈ సంస్థ రుణ రికవరీ పద్ధతులు దారుణంగా ఉండటంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం 2010లో సంచలనం సృష్టించింది.
 
ఎంజీఎల్ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.380-421
మహానగర్ గ్యాస్ లిమిటెడ్(ఎంజీ ఎల్) తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు ధర శ్రేణిని రూ.380-421గా నిర్ణయించింది. దేశంలో రెండో అతి పెద్ద సీఎన్‌జీ రిటైల్ సంస్థ అయిన ఎంజీఎల్ ఈ ఐపీఓ ద్వారా రూ.1,040 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగుస్తుంది.
 
పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
కూరగాయల ధరలు మండిపోవడంతో మే నెల టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.79 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.20గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 0.45గా ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.34 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.21 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 12.94 శాతానికి పెరిగింది.
 
మాల్యా నేరస్థుడే!
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేయడంతోపాటు.. బ్రిటన్‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మరో అడుగుముందుకేసింది. ఈడీ వినతి మేరకు ఇక్కడి ప్రత్యేక మనీలాండరింగ్ నేరాల విచారణ(పీఎంఎల్‌ఏ) కోర్టు మాల్యాను మంగళవారం ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించింది. ఐడీబీఐ బ్యాంకుకురూ.900 కోట్ల రుణ బకాయిలను ఎగవేసిన కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
 
తగ్గిన ఎగుమతులు
అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడంతో ఎగుమతులు మే నెలలో 0.79% క్షీణించి 2,217 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు వరుసగా 18వ నెలలో కూడా పతనమయ్యాయి. మే నెలలో ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా క్షీణించాయి. గత ఏడాది మేలో 3,275 కోట్లు డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది మేలో 13%  తగ్గి 2,844 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది మేలో 1,040 కోట్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈ ఏడాది మేలో 627 కోట్ల డాలర్లకు తగ్గింది.
 
సామాన్యుడికీ విమాన యోగం
కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500, అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీ ఉండాలి. అలాగే వివాదాస్పద 5/20 నిబంధనకు కూడా కేంద్రం చరమగీతం పాడింది. ప్రయాణికులకు టిక్కెట్ రద్దుపై భారీగా కోతపెట్టకుండా పరిమితి విధింపు, అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతోపాటు అకస్మాత్తుగా ప్రయాణాలను రద్దు చేసే ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందేవిధంగా నిబంధనలను చేర్చారు.
 
ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి ఆమోదం
 ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో  ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితోపాటు దాదాపు రూ.1,000 కోట్ల మూలధనంలో ఏర్పాటయిన భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ దాదాపు 90 బ్రాంచీలతో పనిచేస్తోంది. తాజా పరిణామంతో ప్రపంచ స్థాయి బ్యాంక్‌గా ఆవిర్భావ దిశలో ఎస్‌బీఐ కీలక అడుగు వేసినట్లయ్యింది.
 
చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం
చక్కెర ధరను అదుపు చేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటిఫై చేసినట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఆరు నెలల క్రితం రూ. 30 వద్దనున్న చక్కెర ధరలు అమాంతం రూ. 40 వరకూ పెరిగాయి. ఈ నేపథ్యంలో 25 శాతం ఎగుమతి సుంకాన్ని విధించాలంటూ ఆహార మంత్రిత్వ శాఖ సిఫార్సుచేయగా, అంతకంటే తక్కువ సుంకాన్నే ఆర్థిక శాఖ విధించింది.
 
నిధుల సమీకరణలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!
అందుబాటు ధరల్లో గృహాలు, మౌలిక వసతుల రంగానికి రుణాలు అందించేందుకు వీలుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.50వేల కోట్ల నిధుల సమీకరణకు వాటాదార్ల అనుమతి కోరనుంది. డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, టైర్-2 కేపిటల్ బాండ్స్, సీనియర్ లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌ను దేశీయ మార్కెట్లో ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.50వేల కోట్లకు మించకుండా నిధులు సేకరించాలని బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.
 
స్టార్టప్‌ల కోసం ఎస్‌బీఐ ఫండ్
ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగంలో నెలకొనే స్టార్టప్‌ల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 200 కోట్లతో ఫండ్ ఏర్పాటుచేసింది. బ్యాంకింగ్, సంబంధిత టెక్నాలజీ కోసం ఇండియాలో రిజిస్టర్ అయిన స్టార్టప్ కంపెనీకి రూ. 3 కోట్ల వరకూ ఈ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందించనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కొ)లో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.. హడ్కొలో పెయిడప్ ఈక్విటీలో 10 శాతం వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
డీల్స్..
* టెక్నాలజీ రంగంలో అతిపెద్ద డీల్‌కు మైక్రోసాఫ్ట్ తెరతీసింది. వివిధ వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు, ఉద్యోగులు, సంస్థలకు ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న లింక్డ్‌ఇన్‌ను చేజిక్కిం చుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ కోసం ఏకంగా 26.2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(దాదాపు రూ.1.75 లక్షల కోట్లు) చెల్లించనున్నట్లు తెలిపింది.  మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం కావడంతోపాటు... సత్య నాదెళ్ల కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన భారీ డీల్ కూడా ఇదే కావడం గమనార్హం.
* వెల్‌స్పన్ ఎనర్జీ అనుబంధ కంపెనీ ‘వెల్‌స్పన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’(డబ్ల్యూఆర్‌ఈపీఎల్)ని టాటా పవర్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. డీల్ విలువ రూ.9,249 కోట్లుగా ఉంటుందని అంచనా.
* దేశీ బీమా రంగంలో అతిపెద్ద విలీన-కొనుగోలు ఒప్పందానికి తెరలేచింది. మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలను విలీనం చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి.

మరిన్ని వార్తలు